
ప్రజాశక్తి - రాజానగరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 26వ తేదీ గురువారం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో జరిగే ప్రయివేటు కార్యక్రమానికి రానున్నారు. దివాన్ చెరువు సమీపంలోని డిబివి రాజు లే అవుట్ వద్ద హెలిపాడ్, రూట్ మ్యాప్ పాయింటింగ్‌లను కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎస్‌పి పి.జగదీష్, ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, ఇతర అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివాన్ చెరువు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రయివేటు కార్యక్రమంలో సిఎం పాల్గొంటున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలన చేసి, దిశా నిర్దేశం చేశామన్నారు. సిఎం పర్యటనను విజయవంతం కావడంలో అధికారులు పూర్తి సమన్వయం సాధించడం ముఖ్యమన్నారు. ఈనెల 26 గురువారం ఉదయం 10.15కు తాడేపల్లి నుంచి 10.25కి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11.15కు దివాన్ చెరువు డిబివి లే అవుట్‌కు చేరుకుంటారని తెలిపారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడిన అనంతరం 11.30కి వేదిక వద్దకు చేరుకుని రిసెప్షన్‌లో పాల్గొంటారు. అక్కడ నుంచి ఉ.11.45 కు బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు ఉ.11.50 కు చేరుకుని, తదుపరి ఉ.11.55 కు హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి తాడేపల్లికి మ.12.55 కు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, ఆర్‌డిఒ ఎ.చైత్ర వర్షిణి, సిఎం సెక్యూరిటీ అధికారులు ఎఎన్.రంగబాబు, పి ఎం రాజు, ఆర్ అండ్ బి అధికారి ఎస్‌బివి రెడ్డి, డ్వామా పిడి పి. జగదాంబ, డిఇ బివివి మధుసూధన్, స్థానిక ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.