Nov 17,2023 23:06

సిఎం పర్యటన వాయిదా

కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ వెల్లడి
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, పలాస:
 జిల్లాలో ఈ నెల 23న పలాసకు రావాల్సిన ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది తాత్కాలిక వాయిదా మాత్రమేనని, త్వరలోనే సిఎం పర్యటన వివరాలను తెలియజేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పలాసలో ఉద్దానం తాగునీటి పథకం, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్లను ప్రారంభించాల్సి ఉందన్నారు. త్వరలో మరో తేదీని తెలియజేస్తామని స్పష్టం చేశారు.
పర్యటన ఏర్పాట్లు నిలిపివేత
ముఖ్యమంత్రి జగన్‌ 23న పలాస వస్తారనే సమాచారంతో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, ఎస్‌పి జి.ఆర్‌.రాధిక శుక్రవారం పలాసలో పర్యటించారు. కాశీబుగ్గ పద్మనాభపురం సమీపంలో నిర్మించిన 200 పడకల ఆస్పత్రి,కిడ్నీ పరిశోధన కేంద్రం, హెలీప్యాడ్‌ స్థలం, సిఎం బహిరంగ సభ పరిసర ప్రాంతాలను శుక్రవారం కలసి పరిశీలించారు. కిడ్నీ ఆస్పత్రి పనులు ఎంత శాతం పూర్తయ్యింది... ఇంకా ఏ మేరకు పనులు చేయాల్సి ఉంది తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కిడ్నీ ఆస్పత్రి రోడ్డును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆస్పత్రి సమీపంలోని హెలీప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాశీబుగ్గ రైల్వే మైదానంలో సిఎం బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఆసుపత్రి నుంచి రైల్వే మైదానం వరకు భారీ స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సిఎం పర్యటన వాయిదాతో ఏర్పాట్లను నిలిపేశారు.