Nov 07,2023 22:07

కలెక్టరేట్‌ అధికారి అఖిలపక్ష రైతు సంఘాలు వామపక్ష పార్టీల నాయకులు

 కడప అర్బన్‌ సిఎం జిల్లా పర్యటనలో కరువు జిల్లాగా ప్రకటించాలని, లేనిపక్షంలో ఆందోళన తప్పదని అఖిలపక్ష రైతు సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. జిల్లాలో కరువు మండలాలు ప్రకటించాలని మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు మద్దతుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. ఓబులేసు, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు జి. శ్రీరాములు, అఖిలపక్ష రైతు సంఘం జిల్లా కార్యదర్శులు దస్తగిరి రెడ్డి, సుబ్బారెడ్డి, రమణ, శివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కరువు మండలాల పట్ల ముఖ్యమంత్రికి, జిల్లా ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు మండలాలు ప్రకటించాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం చెందారని విమర్శించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ఉండింటే కొంతవరకైనా కరువును నివారించవచ్చని పేర్కొన్నారు. కానీ పాలకులు నిర్లక్ష్యం కారణంగానే ఇవాళ జిల్లాలో కరువు విలయతాండం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ 103 కరువు మండలాలు ప్రకటిస్తే కడప జిల్లాలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించకపోవడం చాలా దుర్మార్గమని తెలిపారు. జిల్లాలో 36 మండలాలలో ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేనాటికి తీవ్ర వర్షా బావ పరిస్థితులు నెలకొన్నాయని, వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయని వాపోయారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి కరువు మండలాలను ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వర్షాభావ విపత్తుతో వేసిన పంటలు ఎండు దశకు చేరుకున్నాయని, సన్న, చిన్న కారు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రబీ సీజన్‌ ప్రారంభమైందని ఇప్పటివరకు వర్షమే కురవలేదని పంట పొలాలన్నీ బీడు భూములుగా ఉన్నాయని రబీ సీజనకు రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా చినుకులు పడలేదని వారు తెలిపారు. కరువు కోరల్లో కడప జిల్లా చిక్కుకున్నదని రైతులకు భరోసా ఇచ్చే విధంగా జిల్లా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు గ్రామాలలో పర్యటించాలని ఆయన కోరారు. ఎండిపోయిన పంటలకు తక్షణమే ఈ క్రాప్‌ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లాలో వలసల నివారణకు కరువు సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని, మళ్లీ పంట వేసుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. కరువు కోరల్లో చిక్కిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, బిఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి గురప్ప, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి రమణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు అన్వేష్‌, సుబ్రహ్మణ్యం, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు నాగ సుబ్బారెడ్డి, ఓబులేసు, సావంత్‌ సుధాకర్‌, మద్దిలేటి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకష్ణయ్య, రైతు నాయకులు చిన్న సిద్ధయ్య, శ్రీనివాసుల రెడ్డి, మహిళా సంఘం నాయకులు భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.