Jul 07,2023 21:33

అధికారులకు సూచనలిస్తున్నకలెక్టర్‌ విజరురామరాజు

పులివెందుల టౌన్‌/ వేంపల్లె : ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి పులివెందుల పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లను కలెక్టర్‌ విజరురామరాజు, ఎస్‌పి అన్బురాజన్‌ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. మున్సిపల్‌ కార్యాలయ ఆవరణంలోని ముఖ్యమంత్రి ప్రారంభిం చబోయే నూతన మున్సిపల్‌ కార్యాలయ భవనాన్ని, నగరవనాన్ని, గరండాల వంక బోటింగ్‌, హాకీ స్టేడియం, క్రికెట్‌ స్టేడియం, తదితర ప్రాంతాలను పరిశీలించి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు తగిన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్‌, ప్రత్యేక అధికారి అనిల్‌ కుమార్‌ రెడ్డి, ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, కమిషనర్‌ నరసింహారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీసులకు దిశ నిర్దేశం చేసిన ఎస్‌పి.. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి మూడు రోజుల కడప జిల్లా పర్యటన నిమిత్తమై పటిష్ట బందోవస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్‌పి అన్బురాజన్‌ అన్నారు. శుక్రవారం పులివెందులలోని సిఎస్‌ఐ మైదానంలో పోలీసులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పోలీసులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా ఒక ఎఎస్‌పి, ఐదుగురు డిఎస్‌పిలు 20 మంది ఎస్‌ఐలు, 120మంది ఎఎస్‌ఐలు, 200 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 500 మంది కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులు పర్యవేక్షిస్తారని చెప్పారు. అనంతరం ఎస్‌పి సిఎం కాన్వారు ట్రయల్‌ రన్‌ లో పాల్గొన్నారు.
ఇడుపులపాయలో కట్టుదిట్టం.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మండలంలోని ఇడుపులపాయలో ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు ఎస్‌పి అన్బురాజన్‌ చెప్పారు. శుక్రవారం మండలంలోని ఇడుపులపాయలో చేపట్టిన సిఎం ఏర్పాట్లును ఆయన పరిశీలించారు. ఇడుపుల పాయలో ముఖ్యమంత్రి పర్యటించే వైఎస్‌ఆర్‌ ఘాట్‌, ఆర్క్‌ వ్యాలీ పోలీసు స్టేషన్‌, చర్చి ప్రాంతాలను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. సిఎం పర్యటన సందర్భంగా చేపట్టిన బందోబస్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయా ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సమర్థ వంతంగా బందోబస్తు విధులు చేపట్టాలని కోరారు. ఆయన వెంట జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.