May 15,2023 01:58
నిజాంపట్నంలో సభాప్రాంగణం పనులు, హెలీ ప్యాడ్‌ పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా

ప్రజాశక్తి-నిజాంపట్నం, బాపట్ల జిల్లా: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పనులు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆదివారం నిజాంపట్నంలో సభాప్రాంగణం పనులు, హెలీ ప్యాడ్‌ పనులను జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా, పార్లమెంటు సభ్యులు మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సోమవారం నాటికి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి సభా ప్రాంగణం వద్ద, రహదారుల వద్ద అవసరమైన ప్రాంతాల్లో బ్యారికేడ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బి అధికారులకు కలెక్టర్‌ చెప్పారు. ముఖ్యమంత్రి సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. సభా ప్రాంగణం వద్ద మత్స్య శాఖకు సంబంధించి మూడు స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మి శివ జ్యోతి, జిల్లా అదనపు ఎస్‌పి పి మహేష్‌, మత్స్య శాఖ జెడి సురేష్‌, వ్యవసాయ శాఖ జెడి అబ్దుల్‌ సత్తార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, రేపల్లె రెవెన్యూ డివిజనల్‌ అధికారి పార్థసారథి, చీరాల రెవెన్యూ డివిజనల్‌ అధికారి సరోజిని, బాపట్ల రెవెన్యూ డివిజనల్‌ అధికారి రవీంద్ర, తహశీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.