Jun 04,2023 22:14

ప్రజాశక్తి - పోలవరం
         పోలవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల ఆరో తేదీన పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి విచ్చేస్తున్న దృష్ట్యా ఆయన పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆదివారం జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి లావణ్యవేణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఆరో తేదీ ఉదయం 10.20 నిముషాలకు ముఖ్యమంత్రి హెలీకాప్టర్‌లో పోలవరం ప్రాజెక్ట్‌ సైట్‌కు చేరుకుంటారని, ప్రజాప్రతినిధులను కలుసుకున్న అనంతరం, ఎగువ కాపర్‌ డ్యామ్‌, దిగువ కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌, ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌లో పనులను పరిశీలిస్తారన్నారు. అనంతరం ప్రాజెక్ట్‌ సైట్‌లోని సమావేశపు హాలుకు చేరుకుని అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి సమీక్షిస్తారన్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల ప్రగతికి సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ అధికారులను జెసి ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఆయా ప్రదేశాల్లో టెంట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి మేరీప్రశాంతి, అసిస్టెంట్‌ కలెక్టర్లు అపూర్వ భరత్‌, శ్రీపూజ, ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌బాబు, ఆర్‌డిఒలు కె.పెంచల్‌కిషోర్‌, ఝాన్సీరాణి, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రవికుమార్‌, తహశీల్దార్‌ సుమతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.