Mar 25,2023 21:52

ప్రజాశక్తి - ఏలూరు
          సిఎం జగన్‌ దెందులూరు మండలానికి వచ్చిన సందర్భంగా ప్రజలను, ప్రతిపక్షాలను, ముఖ్యంగా సిపిఎం నాయకులను గృహ నిర్బంధం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటాన్ని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేకుండా గొంతు నొక్కేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో పరిష్కారం కావాల్సిన సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేకం ఉన్నాయన్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేలే వినతిపత్రాలు, ఆర్జీలు ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వకపోగా అసలు ఇంటి నుండే బయటకు రాకుండా పోలీసులను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యం చేయడం తగదన్నారు. దెందులూరు మండలం దోసపాడులో దళితులు, పేద ప్రజలు తమ భూముల కోసం పోరాడుతున్నారని, సిపిఎం ప్రజల పక్షంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని దోసపాడు ప్రజలను, సిపిఎం నాయకులు కె.శ్రీనివాస్‌ (ఏలూరు), ఎన్‌.రమణరావు(నిడమర్రు), ఎన్‌.నరసింహ(నూజివీడు) ఇతర నాయకులను బయటకు రాకుండా నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. ఎంఎల్‌సి సాబ్జీని కూడా హౌస్‌ అరెస్టు చేసి నిర్బంధించడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణను గృహ నిర్బంధం చేయాలని పోలీసులు పార్టీ కార్యాలయం, అన్నే భవనం వద్ద నిఘా వేయడంతో పాటు ఆఫీసు సిబ్బందిని సమాచారం కోసం వేధించడం తగదన్నారు. ముఖ్యమంత్రి తాను చేసేదంతా మంచి అని, తనకు ఎవ్వరూ ఎదురుచెప్పకూడదని, అసలు ప్రశ్నించకూడదని, తన పరిపాలనలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని, ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కరించేశామని భావించడం తగదన్నారు. ఇదే వైఖరి కొనసాగితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. నిర్బంధాలు, అరెస్టులు, కేసులతో ప్రజాఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు ఆపలేరన్నారు.