Dec 26,2022 23:48

స్థానిక గిరిజనులతో మాట్లాడుతున్న చిన్నయ్యపడాల్‌

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా చింతపల్లి, కొయ్యూరు మండలాల సరిహద్దున ఎర్రవరం ప్రాంతంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ అనుమతులు సిఎం జగన్‌ రద్దు చేయాలని ఏపీ గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, హైడ్రో ప్రాజెక్ట్‌ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌ బోనంగి చిన్నయ్య పడాల్‌ వెల్లడించారు. అల్లూరి జిల్లా పాలకపక్ష నేతలు హైడ్రోపై గిరిజనుల వ్యతిరేకతను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనుంజయతో కలిసి రెండు రోజులపాటు ఆయన ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు బాధిత గ్రామాలను సందర్శించి అక్కడ గిరిజనులతో ఎర్రవరంలో సమీక్షించారు. ఈ మేరకు సోమవారం చిన్నయ్యపడాల్‌ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు క్యాబినెట్‌ ఆమోదం ద్వారా అనుమతుల కల్పనపై తీసుకున్న నిర్ణయాన్ని ఈనెల 29న నర్సీపట్నం వస్తున్న ఏపీ సీఎం జగన్‌ వెనక్కి తీసుకుంటామని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనుల మనుగడకు ఆధారమైన అడవులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎర్రవరం హైడ్రోపవర్‌ ప్రాజెక్టుపై గిరిజనులు తమ హక్కుల్ని, అడవుల్ని కాపాడు కోవడం కోసం పోరాటం చేస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. ఈ ప్రాంతంలో 32 గిరిజన గ్రామాలు ఉన్నాయని తెలిపారు. 5వ షెడ్యూలు ప్రాంతమంతా గిరిజనుల ప్రాంతమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇక్కడ గిరిజనులకే హక్కు ఉందని, అంతే తప్ప ఏ ప్రభుత్వానికి హక్కు లేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు.1995లో అనంతగిరి మండలంలోని గ్రానైట్‌ క్వారీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. గిరిజన సలహా మండలిలో ఆమోదం పొందకుండా గవర్నర్‌ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతగిరి మండలంలో రెండు ప్రాజెక్టులు, విజయనగరంలో ఒక ప్రాజెక్టుల నిర్మాణంతో గిరిజన ప్రాంతమే నాశనమవుతుందన్నారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి పర్యటన దృష్ట్యా గిరిజన బాధితుల గోడును విన్నవించుకోవడానికి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత గిరిజన గ్రామాల ప్రతినిధులు బాలన్న, చినరాజు, వెన్నస్వామి, మంగరాజు, రాజు, ఇతర గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.