Jul 24,2023 23:57

వెంకటపాలెంలో ఇళ్ల అనుమతి పత్రాలను పంపిణీ చేస్తున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మూడుననరేళ్లుగా మూడు రాజధానుల ఏర్పాటు, పరిపాలన వికేంద్రీకరణ గురించి తరచూ ప్రస్తావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా అమరావతి అందరిదని, ఇక మీదట సామాజిక రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రకటించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మే 26న సిఎం జగన్‌ ఇదే గ్రామంలో, ఇదే స్థలంలో ఇళ్ల స్థలాలు పంపిణీ సభలో పాల్గొన్నారు. తిరిగి జులై 24న ఈ స్థలాల్లో ఇళ్లనిర్మాణానికి మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో శంకుస్థాపన చేశారు. వెంకటపాలెం సభలో సిఎం మాట్లాడుతూ 50 వేలమంది పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృధ్ధి చెందుతుందన్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, రెండు నెలలుగా ఇళ్లు కట్టనివ్వకుండా టిడిపి నాయకులు అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేశారని అన్నారు. రాజధాని అంటే అన్ని తరగతులు వారు నివశించాలనే ఆలోచనకు చంద్రబాబు దూరంగా ఉన్నారని, అందుకే పేదలకు ఇళ్ల స్థలాలిస్తే డెమోగ్రఫికల్‌ ఇన్‌బ్యాలెన్సు వస్తుందంటూ కోర్టులను ఆశ్రయించారని విమర్శించారు. తాను పేదల తరుఫున నిలబడి వారి కోసం పోరాడి పెత్తందారులపై విజయం సాధించానని అన్నారు. అమరావతిలో 50 వేల కుటుంబాలు రావడం వల్ల సామాజిక, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు.
రాష్ట్ర గహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ పెత్తందార్ల కోటలను బద్దలు కొట్టి, పేదల పక్షాన నిలిచి, సుప్రింకోర్టు దాకా వెళ్లి వారిని గెలిపించిన జగనన్నకు అందరూ మద్దతివ్వాలన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించారు. తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. రాజధానిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు నివసించాలంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లారని, సామాజిక సమతుల్యత అంటే ఏమిటి? అని చంద్రబాబును ప్రశ్నించారు. పెత్తందార్ల పక్కన బడుగువర్గాల వాళ్ల ఇళ్ళు ఉండటం ఘోరమా, ప్రతిపక్షం పేదల పక్షాన ఉండాలి కానీ పేదలకు ఇళ్ళ స్ధలాలు వద్దు అని కోర్టుకెళ్ళిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. బాపట్ల పార్లమెంట్‌ సభ్యులు నందిగం సురేశ్‌ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సామాన్యుల ఆకలి, పేదవాడి బాధ సిఎం జగన్‌కు తెలిసినంతగా ఎవరికి తెలియదన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ సిఆర్‌డిఎ పరిధిలో 1402.58 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 25 జగనన్న కాలనీల్లో 50,793 మందికి ఇంటి పట్టాలను సిఎం పంపిణీ చేశారని, రెండు నెలలు కూడా తిరగక ముందే లబ్దిదారులందరికి ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలను అందించారని చెప్పారు. లబ్దిదారులందర్నీ ఇంటి నిర్మాణాల ఆప్షన్ల గురించి వివరాలు సేకరించి ఎక్కువ మంది ఆప్షన్‌ 3ని ఎంపిక చేసుకోవడంతో ఇంటి నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. సిఆర్‌డిఎ పరిధిలో 25 లేఅవుట్లలో విద్యుత్‌ సదుపాయాలకు రూ.326.51 కోట్లు, ఇళ్ల నిర్మాణాల కోసం తాత్కాలిక నీటి సరఫరా కొరకు రూ.31.79 కోట్లు, అనుసంధాన రహదారుల ఏర్పాటుకు రూ.7.61 కోట్లతో పనులు చేపట్టినట్లు వివరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజధానిలో పేదల సొంతింటి కల సాకారమైందన్నారు. అతి త్వరలోనే పేదలు ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని సంతోషంగా గృహ ప్రవేశాలు చేసుకునేలా మీరందరూ కూడా వారికి అండగా నిలబడాలని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.