ప్రజాశక్తి-మండపేట
అంగన్‌వాడీలకు ఎన్నికల ముందు సిఎం జగన్ ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.కృష్ణవేణి అన్నారు. స్థానిక మేదరపేటలోని మండపేట ప్రాజెక్ట్ మహాసభ ఎం.సూర్య కుమారి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కె.కృష్ణవేణి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని సిఎం ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలన్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీలకు పెన్షన్, గ్రాడ్యుటీ కల్పించడంతోపాటు ఐసిడిఎస్ బలోపేతం చేయాలన్నారు. గర్భిణులకు, బాలింతలు అందించే పౌష్టికాహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు.
మండపేట ప్రాజెక్ట్ మహాసభ నూతన కమిటీ ఎన్నికలు
అనంతరం మండపేట ప్రాజెక్ట్ మహాసభ నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. కమిటీ అధ్యక్షురాలుగా ఎం.బేబీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డి.ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్.రాణి, కోశాధికారిగా ఎం.కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే జిల్లా మహాసభ విజయవంతనికి తమ వంతు కృషి చేస్తామన్నారు. సమావేశంలో సెక్టార్ లీడర్లు ఎం.జానకి దేవి, వి.మంగాదేవి, సింగం దుర్గ, వి.వజ్రం, జి.నాగలక్ష్మి, చిరంజీవి, చంటి, సుహాసిని, శిరీష, గౌరీ, విజరు కుమారి, సత్య, సత్యవేణి, జి.పద్మ, నూకరత్నం, కృష్ణకుమారి, జయలక్ష్మి కుమారి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలి
అంగన్‌వాడీ వర్కర్లకు రెండు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణం చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో బతుకుతున్న అంగన్‌వాడీలకు గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం చాలా దారుణమన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1759 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 3340 మంది కార్యకర్తలు, మరో 89 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇప్పటికీ 2017 నుంచి పెండింగ్ లో ఉన్న టిఎ బిల్లులు చెల్లింపులు జరగలేదన్నారు. ఒకటో తేదీ నాటికి ప్రతినెల వేతనాలు చెల్లిస్తానన్న సిఎం జగన్ హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. తక్షణం వేతనాలు చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.










