
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా కల్తీ, నాసిరకమైన మద్యం అమ్మి జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష కోట్లు దోచుకున్నారని, అయితే చంద్రబాబు హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ కేసు పెట్టడం హేయమని టిడిపి బిసి సెల్ జిల్లా అధ్యక్షులు వి.శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు, కొల్లురవీంద్రపై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తూ జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి అధ్యక్షతన గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మకు మద్యం బాటిళ్లతో దండ వేసి మద్యాభిషేకరం చేశారు. ఈ సందర్భంగా వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ అడ్డగోలుగా కేసులు, తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని అణచివేయడమే లక్ష్యంగా కొల్లు రవీంద్రపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. అన్నాబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తా... ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తా.. అని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడా హామీనే విస్మరించారన్నారు. కార్యక్రమంలో ఎం.చినకొండలరావు, యు.పేరయ్య, ఎం.ఈశ్వరరావు, టి.చంద్రశేఖర్, డి.ఏసుబాబు పాల్గొన్నారు.