ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి బాపట్ల జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్‌బాషా ఆదేశించారు. జిల్లా ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. బాపట్లలో అభివృద్ధి చేయాల్సిన ప్రాధాన్య తా అంశాలను అధికారులు గుర్తించాలని కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించిన సమయంలో ప్రజలకు పలు హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆ హామీలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించరాదని ఆయన హెచ్చరించారు. రాయితీలు వర్తించేలా ఆక్వా చెరువులను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకురావాలని మత్స్యకారులు సిఎంను కోరడంతో జిల్లాలో నూతనంగా 8,200 ఎకరాలను ఆక్వా జోన్ కిందకు తెచ్చామన్నారు. నిజాంపట్నం హార్బర్ నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు లభించగా పనులు కొనసాగు తున్నాయన్నారు. నిజాంపట్నం పోర్టులో బోట్ యార్డ్ నుంచి మత్స్యకార కాలనీ వరకు రివిట్మెంట్ చేయాల్సిన ప్రక్రియ నిర్మాణ దశలో ఉందన్నారు. ధాన్యం కొనుగోలులో 20 మెట్రిక్ టన్నులు మించామని కలెక్టర్ చెప్పారు. గడప గడపకూ మన ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షల నిధులతో మంజూరైన పనులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. కొమ్మమూరు కెనాల్ అభివృద్ధి కోసం రూ.15 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. కారంచేడులో తాగునీటి చెరువు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం మంజూరు చేస్తూ అధికారికంగా ఆమోదించిందన్నారు. పావులూరులో ఆటోనగర్ ఏర్పాటుపై స్థలం కేటాయించాల న్నారు. గుంటూరు కెనాల్ తొండివారు అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. రేపల్లెలో 1,344 టిడ్కో గృహాలు త్వరగా పూర్తిచేయాలని ఎస్‌పిసిఎల్ సంస్థకు 2000లో ఒకసారి నోటీసులు ఇవ్వగా, 2022లో మరోసారి నోటీసులిచ్చామన్నారు. అయినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ఆరా తీశారు. కేవలం 196 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని వివరించారు. వేమూరు నియోజకవర్గం లోని భట్టిప్రోలు, కొల్లూరు మండలాలలోని లంక గ్రామాలలో సాగుచేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇచ్చే ప్రక్రియ పురోగతిలో ఉందని కలెక్టర్ చెప్పారు. నది పోరంబోకు భూములుగా నమోదైన ప్రాంతంలో 1994 మంది రైతులు సాగుచేసుకుంటు న్నారని తెలిపారు. భూముల సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ భూములను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వేమూరులో జగనన్న కాలనీలో ఏర్పాటులో భాగంగా 161 లేఅవుట్స్ ఉండగా 51 లేఅవుట్స్‌ను మూడడుగులకు పైగా మెరక తోలించాలని ప్రజలు కోరారన్నారు. ఇందుకోసం 158 పనులు మంజూరు కాగా, వేగంగా పనులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఇచ్చే ప్రక్రియ టెండర్ దశలో ఉండగా వడిగా చేపట్టాలన్నారు. మిర్చి పంటకు బీమా పరిహారం అందేలా చూడాలన్నారు. సుబాబుల్ కర్ర కొనుగోలులో ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర పక్కాగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు నివాసముండే 62 గ్రామాలకు శ్మశాన భూములు లేవని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పటివరకు 47 గ్రామాలకు భూమిని గుర్తించి కేటాయించే ప్రక్రియ చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు విధిగా శ్మశాన భూమి కేటాయించాలని ఆయన ఆదేశించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేటాయించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు భూమి కేటాయించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ చామకూరి శ్రీధర్, డిఆర్‌ఓ కె లక్ష్మీశివజ్యోతి, ప్రకాశం జడ్పి సిఇఓ బి జాలిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










