జమ్మలమడుగు : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు పట్టణ మహాసభలు స్థానిక డివిజన్ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. తొలుత స్థానిక నాయకులు దాసు జెండా ఆవిష్కరించారు. మహాసభలకు అంగన్వాడీ యూనియన్ పట్టణ కార్యదర్శి భాగ్యమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు రూ.26 వేలు, మున్సిపల్ వర్కర్స్ రూ.16 వేలు, విఆర్‌ఎలకు తెలంగాణ కంటే రూ.వెయ్యి ఎక్కువ పెంచుతానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు విజయకుమార్, నాయకులు దాసరి విజరు, దాసు, కార్మికులు పాల్గొన్నారు. అనంతరం నూతన సిఐటియు కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ సిఐటియు కార్యదర్శిగా దాసరి విజరు, అధ్యక్షులుగా దాసన్న, ట్రెజరర్‌గా భాగ్యమ్మ, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులుగా వినరు, లక్ష్మీదేవి, ప్రసాద్‌రెడ్డి, ఆదాము, శేఖర్ నాగన్న, కో-ఆప్షన్ సభ్యులుగా శివన్నారాయణ, సభ్యులుగా నరేంద్ర, దస్తగిరి, రాజు, దివాకర్, జ్యోతి, రవి, అబ్రహం,గంగాధర్, కమల్ భాష, హుస్సేన్ వల్లి, నాగన్నలను ఎన్నుకున్నారు.










