ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్: సిఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, నగర అధ్యక్షులు అరుగుల గణేష్ డిమాండ్ చేశారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళంలో ఏడు రోడ్ల జంక్షన్ నుండి కార్పొరేషన్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అమ్మన్నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను 6 నెలల్లో పర్మినెంట్ చేస్తామని సిఎం జగన్ హామీ ఇచ్చి నాలుగేళ్లయినా నేటికీ అమలు చేయలేదన్నారు. పెరిగిన నగర విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికులను పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు కళ్యాణ రాజు, ఎ.గురుస్వామి, ఆకుల శంకర్, ఎ.శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలస : పట్టణంలో మోనింగివారివీధి నుంచి గేటు, కృష్ణాపురం జంక్షన్ వరకు మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు టి.సంతోష్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఎన్. రాజేష్, జె.శ్రీనివాస్, జె.వాసు, డి.రాజేష్, కార్మికులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం : మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ జంక్షన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు బైక్‌ర్యాలీ కొనసాగింది. అనంతరం రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు










