ప్రజాశక్తి - ఎఎన్‌యు : యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వర్సిటీలో ప్రదర్శన నిర్వహించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. కార్యక్రమానికి నాగార్జున యూనివర్సిటీ టీచింగ్ అసోసియేషన్ (నూటా) ఆధక్షులు ప్రొఫెసర్ బి.నాగరాజు అధ్యక్షత వహించారు. వీసీ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని కొనియాడారు. వర్సిటీ ఆధ్వర్యంలో కొద్ది రోజుల్లో సిఎంకు ధన్యవాదాలు తెలిపే సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అనంతరం సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రెక్టార్ ప్రొఫెసర్ పి.వరప్రసాద్ మూర్తి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా సిఎం చేశారన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెర్ బి.కరుణ, ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ప్రొఫెసర్లు










