Sep 03,2022 23:32

13వ వార్డులో పర్యటిస్తున్న మేయర్‌, కమిషనర్‌ తదితరులు

ప్రజాశక్తి - ఆరిలోవ : 'సాక్ష్యాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పినా వినరా? మీలో మార్పు రాదా? ప్లాస్టిక్‌ వల్ల అనర్థాలొస్తున్నాయని చెబుతున్నా పట్టించుకోరా?' అంటూ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీశ ఆగ్రహం వ్యక్తం చేశారు. 13వ వార్డులో పరిధిలోని జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీ, పైనాపిల్‌ కాలనీ, సిఐడి ఆఫీస్‌ తదితర ప్రాంతాలలో కార్పొరేటర్‌ కెల్లా సునీతతో కలిసి శనివారం వారిరువురు పర్యటించారు. ఆ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఇంకా ప్లాస్టిక్‌ బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించి ఉండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖ వేదికగా జగన్మోహన్‌రెడ్డి ప్లాస్టిక్‌ వినియోగాన్ని రాష్ట్రంలో బ్యాన్‌ చేస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే బాధ్యులపై చర్యలు చేపట్టాలని, ఫ్లెక్సీల వ్యాపారులకూ నోటీసులివ్వాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో తాగే నీరు బురదగా వస్తుందని, బోర్లు మరమ్మతులు అయ్యాయని స్థానికులు వారికి వివరించారు. దీనిపై మేయర్‌, కమిషనర్‌ స్పందిస్తూ ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణానికి అంచనాలు తయారుచేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. వార్డులో ఆక్రమణలను తొలగించాలని, నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు గ్రీన్‌ తెరలు ఏర్పాటుచేయాలని, బిల్డింగ్‌ యొక్క ప్లాన్‌ ప్రదర్శించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్తి పన్ను, యూజర్‌ చార్జీలు విధిగా చెల్లించాలని స్థానికులకు తెలియజేశారు.
అనంతరం మలేరియా, డెంగ్యూ వ్యాపించకుండా యాంటీ లార్వా ఆపరేషన్‌ చేయాలని, సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కెఎస్‌ఎల్‌జి శాస్త్రి, జోనల్‌ కమిషనర్‌ రాము, ఈఈ మత్స్యరాజు, డీఈ వంశీ, ఎంఎంఒహెచ్‌ డాక్టర్‌ కిషోర్‌, ఎసిపి శాస్త్రి, స్థానిక వైసీపీ నేతలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.