Dec 24,2022 23:59

పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గణేష్‌

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:నర్సీపట్నం నియోజక వర్గంలో ఈనెల 28న సుమారు రూ.1000 కోట్లతో నిర్మించే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో నర్సీపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక బలిఘట్టం బైపాస్‌ రోడ్‌లో హెలీ ఫ్యాడ్‌ నిర్మించారు. పెద్దబొడ్డేపల్లి జోగు నాదుని పాలెం వద్ద బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌ నుండి బహిరంగ సభ వరకు సీఎం జగన్మోహన్‌ రెడ్డి రోడ్‌ షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్‌, జిల్లా కలెక్టర్‌ రవి పటాన్‌ శెట్టి ఆదేశాల మేరకు రోడ్‌ షోకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉమా శంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఈనెల 28న ఉదయం 11 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తామని అధికార వర్గాలు తెలియజేశాయి. ఆర్‌ అండ్‌ బి, విద్యుత్‌ శాఖ అధికారులు రోడ్‌ కు ఇరువైపులా ఉన్న విద్యుత్‌ స్తంభాలను మార్చుతూ అడ్డంగా ఉన్న చెట్లను నరికివేశారు. ఎన్నికల వేడి సమీపిస్తున్న తరుణంలో జగన్మోహన్‌ రెడ్డి నర్సీపట్నం రావడం ఇది రెండోసారి.
మొక్కలు తొలగింపు
నర్సీపట్నం టౌన్‌: సీఎం సభ పుణ్యమా అని నర్సీపట్నం లో ఏపుగా ఎదిగిన చెట్లను నేలమట్టం చేస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలన్న అధికారులే నర్సీపట్నంలో ఏపుగా ఎదిగిన మొక్కలను నేలమట్టం చేశారు. జగనన్న పచ్చతోరణం, వనమహౌత్సవం పేరుతో సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.మొక్కలు నాటే కార్యక్రమం ఓ యజ్ఞంలా చేపట్టాలని కూడా తెలియజేశారు. నాయుడుపేటలో ఎన్నో ఏళ్లుగా ఎదుగుతున్న, హరితహారం పేరుతో నాటిన మొక్కలను నరికి వేశారు. ఎన్నో ఏళ్ల క్రితం ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. సీఎం సభ పేరు చెప్పి ఇలా అక్రమంగా నరికి వేయించడం పలు విమర్శలకు తావిస్తోంది.
సీఎం బహిరంగ సభకు తరలిరావాలి
ప్రజాశక్తి-గొలుగొండ:ఈ నెల 28న నర్సీపట్నంలో జరిగే సిఎం జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఎల్‌పురం సర్పంచ్‌ లోచల సుజాత, ఎంపిటిసి చింతల బుల్లి ప్రసాద్‌లు కోరారు. శనివారం వారు మాట్లాడుతూ సీఎం సభకు భారీ జన సమీకరణ చేస్తున్నామన్నారు. మండలం నుంచి అధిక సంఖ్యలో ప్రజలను సీఎం సభకు తరలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.