ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: ఈనెల 28న నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా నర్సీపట్నంలో బహిరంగ సభ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, జిల్లా ఎస్పీ గౌతమి షాలిని,ఎమ్మెల్యే గణేష్, ఆర్డిఓ భవాని శంకర్, ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్, సీఎం ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం తదితరులు స్థలాన్ని గురువారం పరిశీలించారు. మెడికల్ కాలేజీ శంకుస్థాపనపై ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మూడవసారి ఏ విధంగా అయినా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని, నర్సీపట్నంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గణేష్ పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు, నాయికులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా నర్సీపట్నం, చింతపల్లి మార్గంలో డిగ్రీ కాలేజ్ వద్ద, సిఎంఆర్ షాపింగ్ మాల్ వెనుక, నర్సీపట్నం- కోటవురట్ల మార్గంలో జోగునాదుని పాలెం వద్ద తదితర ప్రాంతాలు పరిశీలన చేశారు. సీఎం హెలిప్యాడ్‌కు, బహిరంగ సభకు తక్కువ దూరం ఉండేలా పరిశీలన చేయాలని కార్యక్రమం కన్వీనర్ రఘురాం తెలియజేశారు. వీరి వెంట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, డిసిసిబి చైర్ పర్సన్ అనిత సన్యాసిపాత్రుడు, నర్సీపట్నం, గోలుగొండ, నాతవరం, మాకవరపాలెం ఎంపీపీ, జడ్పిటిసిలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు.










