Aug 03,2023 22:48

సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణదాస్‌

- రోజుకో అబద్ధంతో విపక్షాల కుయుక్తులు
- క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌
ప్రజాశక్తి - నరసన్నపేట: 
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే, అక్కడ్నుంచే చేస్తానని ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఎంపీగా పోటీ చేయాలని ఆదేశిస్తే ఎంపీగానే చేస్తానని స్పష్టం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విపక్షాలు రోజుకో అబద్దంతో ప్రజలను వంచిస్తున్నాయన్నారు. స్వార్థమే పరమావధిగా పవన్‌, చంద్రబాబు కుయుక్తులు చేస్తున్నారని విమర్శించారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి అవకాశమున్నా ఏమీ చేయని టిడిపి, ప్రజా ధనం ప్రభుత్వం వృథా చేస్తోందని నాలుగేళ్లుగా గగ్గోలు పెట్టిందన్నారు. ఇప్పుడు తామూ ఆ పథకాలు కొనసాగిస్తామని చెప్తోందన్నారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ పాలన అందించాలన్న లక్ష్యంతో సిఎం జగన్‌ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రారంభమైందే జగనన్న సురక్ష కార్యక్రమం అని చెప్పారు. అర్హులైన వారు ప్రభుత్వ పథకాలు అందకుండా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల నుంచి గ్రామస్థాయి సిబ్బంది వరకు అంతా కలిసి పనిచేశారన్నారు. జగనన్న సురక్ష అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో నెరవేర్చిందని తెలిపారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 1.46 కోట్ల కుటుంబాలను వాలంటీర్లు సర్వే చేసి ప్రజలకు ఏ సేవలు కావాలో అడిగి మరీ నమోదు చేసుకున్నారని వివరించారు.
పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పదవులు ఆశించిన కొందరు నేతలు, పదవులు పొందిన వారు సైతం పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎంతటి వారైనా సరే వారిపై వేటు తప్పదన్నారు. పద్ధతి మార్చుకునేందుకు చివరి అవకాశం ఇస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపిపి ఆరంగి మురళీధర్‌, చింతు రామారావు, ముద్దాడ బైరాగినాయుడు, కోరాడ చంద్రభూషణ్‌ గుప్త, చీపురు కృష్ణమూర్తి, నక్క తులసీదాస్‌, తంగి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.