Mar 08,2023 21:15

శిధిలావస్థలో గ్రామీణ పశు వైద్య శాల

శిధిలావస్థలో పశు వైద్య శాల
- బీటలు వారిన గోడలు
- పెచ్చులూడుతున్న పై కప్పు
- బిక్కు బిక్కుమంటూ సిబ్బంది విధులు
- పట్టించుకోని ఉన్నతాధికారులు
ప్రజాశక్తి - నంద్యాల రూరల్‌

       నంద్యాల మండలం బిళ్లాలాపురం గ్రామంలోని పశు వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనం పై కప్పు పెచ్చులూడి పడుతున్నాయి. భవనంలో ఎప్పుడు ఏది ఊడి పడుతుందో.. ఏం జరుగుతుందో తెలియక సిబ్బంది భయం నీడలో బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.
బిళ్లాలపురం గ్రామంలోని పశు వైద్యశాల 43 సంత్సరాల క్రితం 1980 నవంబర్‌ 28వ తేదీ ఆనాటి గ్రామ సర్పంచ్‌, పెద్దలు కలిసి నిర్మించారు. అప్పటి శాసన సభ్యులు బొజ్జ వెంకట రామిరెడ్డి పశు వైద్యశాలను ప్రారంభించారు. ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలావస్థ దశకు చేరుకుంది. పై కప్పు పూర్తిగా శిథిలావస్థకు చేరి ఇనుప ఊసలు బయటకు దర్శనమిస్తున్నాయి. సిబ్బంది విధుల్లో నిమగమైనప్పుడు ప్రమాదం చోటుచేసుకునే అవకాశముంది. అప్పుడప్పుడు పై కప్పు నుండి పెచ్చులూడి సిబ్బంది తలపై పడి గాయాలయిన సంఘటనలూ ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే పై కప్పు నుండి వర్షపు నీరు కారుతూ ఉంటుంది. దీంతో భవనం ఎప్పుడు కూలుతుందోనని సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలంలో సిబ్బంది విధులు నిర్వర్తించ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సర్పంచి, అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని పశు పోషకులు వాపోతున్నారు. కొత్త భనన నిర్మాణం కోసం ఎన్నో సార్లు నివేదికలు పంపించామని సిబ్బంది చెబుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామాలను అభివృద్ది చెయ్యాలని, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పాల కేంద్రాలు, హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందించాలనే ముఖ్యమంత్రి ఆశయం నంద్యాల పట్టణానికి అతి సమీపంలో వున్న బిళ్లాలాపురంలో కనీసం సచివాలయం కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. సచివాలయం సిబ్బంది పది మంది పైగా రెండు ఇరుకు గదుల్లో తీవ్ర ఇబ్బందులతో విధులు నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి గ్రామంలో నూతన పశు వైద్యశాలను, సచివాలయం, హెల్త్‌ సెంటర్‌, పాల కేంద్రం నిర్మించి సేవలు అందించాలని గ్రామస్తులు, పశు పోషకులు, రైతులు కోరుతున్నారు.