Jan 13,2023 22:21

ప్రజాశక్తి - ఉంగుటూరు
           సంక్రాంతి సందర్భంగా కోడి పందేలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసేశారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం హెచ్చరికలను లెక్కచేయకుండా సకల ఏర్పాట్లను పందెంరాయుళ్లు పూర్తి చేయడం గమనార్హం. మండలంలో గతంలో రెండు బరులు ఉండేవి. ఈసారి నిడమర్రు మండలం పత్తేపురం నుంచి నారాయణపురానికి బరి బదిలీ అయింది. దీంతో నారాయణపురం- గణపవరం మార్గంలో బరులను ఏర్పాటు చేయడంతో ారాయణపురంలో మూడు బరులు అయ్యాయి. ఈ మూడూ అధికారి పార్టీ నాయకులకు చెందినవే కావడం గమనార్హం. ఇప్పటికే పందేలకు రమ్మని ఆహ్వానాలు కూడా వెళ్లిపోయాయి. ఓ మాజీ మంత్రి పండుగ మూడు రోజులూ ఇక్కడే మకాం ఉంటారని చెబుతున్నారు. ఆయనకు చెందిన సుమారు 25 నుంచి 30 పుంజులు సైతం పందేలకు రెఢగాీ ఉన్నాయి. ఒక్కో పందెం రూ.రెండు లక్షలు పైనే ఉండబోతోందని ప్రచారం సాగుతోంది. కొత్త ఉంగుటూరు, నారాయణపురం వైఎస్‌ఆర్‌ కాలనీ, బాదంపూడి మత్య్స కేంద్రం పక్కన, చిన్నవెల్లమిల్లిలో వ్యవసాయ పొలం, గొల్లగూడెం శివాలయం చెరువు గట్టు సమీపం, రాచూరులో సచివాలయానికి ఎదురుగా స్థలంలో కోడి పందేలు, గుండాట, పేకాట తదితర జూద క్రీడలు నిర్విరామంగా సాగేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఫ్లడ్‌ లైట్లు, అతిధుల వీక్షణ కోసం స్టేజీ డెకరేషన్‌తో తీర్చిదిద్దుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కోడి పుంజులు ప్రత్యేక వాహనాల్లో ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరాయి.
ముదినేపల్లి:సంక్రాంతిని పురస్కరించుకుని కోడిపందేలు, జూదాలు పెద్దఎత్తున నిర్వహించేందుకు మండలంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వడాలి, అన్నవరం ,బొమ్మినంపాడు తదితర గ్రామాల్లో ఉన్న ఖాళీస్థలాల్లో నేలను చదును చేయగా, మరికొన్ని గ్రామాల్లో నేలను చదును చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈసారి కోడిపందేలు, జూదాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు అధికార పార్టీకి చెందిన పెద్దలు కసరత్తు చేస్తున్నారు. గతంలో కోడిపందేలు నిర్వహించిన గ్రామాలతోపాటు కొత్తగా మరికొన్ని గ్రామాల్లో పందేల నిర్వహణకు అనుమతులు కోసం నిర్వాహాకులు పోలీస్‌ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా తగ్గేదేలేదంటూ నిర్వాహకులు బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు.