ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి పేదవానికీ వైద్య సేవలు అందించి, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చేపట్టిన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష అని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. నరసరావుపేట మండలంలోని చినతురకపాలెంలో గురువారం నిర్వహించిన శిబిరంలకెమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టిందన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నుండి పిడుగురాళ్లలో వైద్య కళాశాల ఏర్పాటు వరకు గణనీయమైన మార్పులు చేపట్టినట్లు చెప్పారు. నరసరావుపేటలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 35 మంది డాక్టర్లను నియమించామని, నెలకు 300 ప్రసవాలు చేయడం ద్వారా రాష్ట్రంలో పల్నాడు జిల్లా ముందు వరసలో ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతంలో జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, మరిన్ని వైద్యశిబిరాల నిర్వహణకు చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 72 వైద్యశిబిరాలు నిర్వహించామని, పరీక్షలు, వైద్యం అనంతరం నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. కిశోర బాలికల్లో రక్త హీనత తగ్గిచుటలో భాగంగా ఎక్కడా లేని విధంగా జిల్లాలో పాఠశాల విద్యార్థినులకు ప్రోగ్రెస్ కార్డు రూపంలో 'బంగారు తల్లి' కార్యక్రమమం ద్వారా కార్డులను అందిస్తున్నట్లు చెప్పారు. అందులో ఎప్పటికప్పుడు రక్త పరీక్షల వివరాలు నమోదు చేయడం పిల్లల తల్లిదండ్రుల సంతకం తీసుకోవడం వంటివి చేపట్టినట్లు తెలిపారు. అక్షరాశ్యత, సరాసరి జీవనం, కోనుగోలుశక్తి వంటి వాటిపై గుర్తించి జిల్లాలకు, రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పల్నాడు జిల్లా 35 శాతం రక్త హీనత ఉన్న కిశోర బాలికలు ఉన్నారన్నారు. వారికి బడిలో అందించే పౌష్టిక ఆహరంతో పాటు ఇంటి వద్ద కూడా ఐరన్ రిచ్ పదార్థాలను అందించాలన్నారు. ఉద్యోగం కోసమే చదువు కాదని, మానసిక, సామాజిక వికాసానికి తోడ్పడుతుందని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు చిన తురకపాలెం ఆదర్శ గ్రామమన్నారు. గ్రామానికి చెందిన యువకులు సుమారు 29 మంది డాక్టర్లు, 300 మంది పైచిలుకు ఇంజినీర్లు ఉన్నారన్నారు. 'బంగారు తల్లి' కార్యక్రమాన్ని చినతురకపాలెం నుండి ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జెసి ఎ.శ్యాం ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రవి, జిల్లా విద్యా శాకాదికారి శ్యామ్యూల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి మోహన్, తహశీల్దార్ ఆర్.వి రమణ నాయక్, ముదిరాజ్ కార్పోరేషన్ చైర్మన్ స్వామీ, సర్పంచ్ పి.ఖాజా, ఎంపిటిసి మౌలాలి పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం బంగారుతల్లి ప్రోగ్రెస్ కార్డులను పలు పాఠశాలల హెచ్‌ఎంలకు అందించారు.










