హోమీబాబా ఆసుపత్రిలో ఉద్యోగ నియామకాలపై
సిబిఐతో విచారణ చేపట్టాలని ధర్నా
ప్రజాశక్తి-ఉక్కునగరం : అగనంపూడి హోమీబాబా కేన్సర్ ఆసుపత్రిలో ఇటీవల రహస్యంగా చేపట్టిన ఎల్‌డిసి నియామకాలపై సిబిఐ విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం 85వ వార్డు ఫార్మసిటీ కాలనీలో హోమిబాబా కేన్సర్ ఆసుపత్రి ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టిడిపి వార్డు అధ్యక్షులు దసేంద్ర అధ్యక్షతన జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడతూ, ఆసుపత్రిలో స్థానికులకు 70శాతం ఉద్యోగావకాశాలను కల్పించాలని కోరారు. ఆసుపత్రిలో స్థానికులకు, ప్రజాప్రతినిధులకు కనీసం మర్యాద, ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.90 వసూలు చేసేవారని, ఇపుడు దాన్ని ఏకంగా రూ.మూడు వేలకు పెంచడం దారుణమని, దీంతో కేన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని ఆరోపించారు. ఆసుపత్రిలో పిఆర్‌ఒను నియమించాలని కోరారు. దీనిపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి. తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కరణం సత్యారావు, వార్డు కార్పొరేటర్లు రౌతు శ్రీనువాసరావు, గంధం శ్రీనువాసరావు, మొల్లి ముత్యాలు పాల్గొన్నారు.










