* ఆర్‌టిసి ఇయు రాష్ట్ర అధ్యక్షులు పి.దామోదరరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ఆర్‌టిసి ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎంప్లాయీస్ యూనియన్ కృషి చేస్తోందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు అన్నారు. నగరంలోని రెవెన్యూ అతిథిగృహంలో యూనియన్ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌టిసిలో ఉద్యోగులకు 11వ పిఆర్‌సి తర్వాత కేడర్ స్ట్రెంత్ సమస్య ఉత్పన్నమైందని, దీనివల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు ఈనెల 24న ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని తెలిపారు. ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత గతంలో జీతం ఆధారంగా చెల్లించే ఓవర్ టైమ్ డ్యూటీ, నైట్ హాల్టు అలవెన్సులు, మహిళలకు ప్రతినెలా చెల్లించే హెల్త్ అలవెన్సు, మెంటినెన్స్ సిబ్బందికి ఇచ్చే టెక్నికల్ అలవెన్సులు, క్లరికల్ సిబ్బంది నుంచి ఆఫీసర్ల వరకు చెల్లించే గ్రేడ్ పే అలవెన్సులు సకాలంలో అందడం లేదన్నారు. వీటిని ప్రతి నెలా జీతంతో పాటే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్సెంటివ్ స్కీమ్‌లను పాత పద్ధతిలోనే కండక్టర్లు, డ్రైవర్లు, మెంటినెన్స్ సిబ్బందికి ప్రతినెలా చెల్లించాలన్నారు. వైద్య సౌకర్యాలు గతంలో మాదిరిగానే ఇహెచ్‌ఎస్ నుంచి ఆర్‌టిసి ఉద్యోగులకు మినహాయింపునిచ్చి, మెరుగైన వైద్యం కోసం రిఫరల్ హాస్పిటళ్ల ద్వారా కార్పొరేట్ వైద్యం అందించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఆర్‌టిసి ఉద్యోగి, భార్యకూ గతంలో ఉన్న రిటైర్డు ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్ ద్వారా వైద్య సౌకర్యాలు అందించేవారని, అదే తరహాలో ప్రస్తుత రిటైర్డు ఉద్యోగులకు హెల్త్ స్కీమ్‌ను వర్తింజేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి నరసయ్య మాట్లాడుతూ విలీనానికి ముందున్న ఆర్‌టిసి రిక్రూట్‌మెంట్, రెగ్యులేషన్స్ ప్రకారమే పిటిడి ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలన్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ భానుముర్తి, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.వెంకటరావు, పి.నానాజీ, ఎపి జెఎసి జిల్లా చైర్మన్ కంచరాన శ్రీరాములు, ఆర్‌టిసి ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు కె.జె శుభాకర్, బి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.










