
ప్రజాశక్తి-తెనాలి : పేరుకే ఉన్నతాధికారి కార్యాలయం.. అంతా అరకొరే. అవసరమైన స్థాయిలో మందుల సరఫరా ఉండదు. పెరిగిన పని భారానికి తగిన విదంగా సిబ్బంది లేరు. దీనికితోడు పాలనాపరమైన అదనపు బాధ్యతలు. ప్రతినెలా చేతి చమురు వదిలించుకోవటం మినహా మిగిలిందేమీ లేదు. ఎంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోతే అంత బాగుంటుందనే ధోరణి అధికారుల్లో కనిపిస్తోంది.
స్థానిక బుర్రిపాలెం రోడ్డులో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయం పరిధిలో గుడివాడ, కొలకలూరు, పెదరావూరు, అంగలకుదురు మొత్తం నాలుగు వెటర్నరీ డిస్పెన్సరీలున్నాయి. బుర్రిపాలెం, పినపాడు, కంచర్లపాలెం, నందివెలుగు, ఐతానగర్, సంగంజాగర్ల మూడి మొత్తం ఆరు వెటర్నరీ సబ్ సెంటర్లు ఉన్నాయి. కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు ఒక కాంపౌండర్, ఇద్దరు అటెండర్లు ఉన్నారు. కార్యాలయం పట్టణ శివారులో ఉంటుంది. శివారు ప్రాంతంలో పశుపోషకులు అధికమే. పట్టణ పరిధిలో పెంపుడు కుక్కలు కూడా ఎక్కువే. కార్యాలయం పరిధిలో దాదాపు 1700 నుంచి 2 వేల వరకూ గేదెలున్నాయి. పెంపుడు కుక్కల సంఖ్య లెక్కకు మించే ఉంది. దీంతో ఆసుపత్రికి ప్రతి రోజు గేదెలు, పంపుడు కుక్కల తాకిడి అధికమే.
ఆసుపత్రలో గెదెలకు వ్యాక్సినేషన్‌తో పాటు జ్వరం, డయేరియా, చనుబబ్బుల వంటి రుగ్మతలకు చికిత్స అందిస్తున్నారు. పశువుల్లో సంక్రమించే వివిధ రకాల వ్యాధుల చికిత్స నిమిత్తం గేదెలు, కుక్కలను వాటి యజమానులు ఆసుపత్రికి తీసుకువచ్చి, తీసుకువెళుతుంటారు. పెంపుడు కుక్కలకు యాంటి రేబిస్ వ్యాక్సిన్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తుంటారు. గేదెలు రోజుకు 20 నుంచి 30, కుక్కలు రోజుకు 30 నుంచి 40 వరకూ వస్తుంటాయి. గతంలో రోజు మొత్తం మీద 20 కేసులు వచ్చేవని, ఇప్పుడు కేసుల సంఖ్య పెరగటంతో సిబ్బంది చాలటం లేదని అధికారి చెబుతున్నారు. అధికారిగా ఉన్న ఎ.డిికి పాలనా పరమైన వివిధ రకాల పనులు, క్షేత్రస్థాయిలో పర్యటనలు పెరగటంతో పని భారం పెరిగిందని ఆయన చెబుతున్నారు. ఆసుపత్రిలో కేసుల పెరుగుదలకు అనుగుణంగా మందుల సరఫరా పెరగలేదని, ఫలితంగా సొంత ఖర్చులతో పశువులకు మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనిభారం తట్టుకోలేకపోతున్నాం
డాక్టర్ ఆర్.నాగిరెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్, తెనాలి
గతంలో ఆసుపత్రికి గేదెలు, కుక్కల తాకిడి తక్కువ ఉండేది. ప్రస్తుతం ఉన్న కాంపౌండర్, ఇద్దరు అటెండర్ల సాయంతో సేవలందిచేవాళ్లం. ఇప్పుడు పనిపెరిగి సిబ్బంది చాలటం లేదు. వెటర్నకీ బిఎస్సీ చదువుతున్న విద్యార్థులతో కాలం వెళ్లదీస్తున్నాం. కనీసం పురపాలక సంఘ కేంద్రంలో ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ను అయినా కేటాయించాలి. గతంలో తక్కువ కేసులున్నపుడు ఏ మోతాదులో మందులు పంపిణీ చేశారో అదే మోతాదు ఇప్పటికి సరఫరా చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరగటంతో మందులు చాలటం లేదు. ప్రతినెలా సొంతగా మందులకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్థిక భారం పెరిగిపోయింది. దీనికి తోడు పాలనాపరమైన అదనపు బాధ్యతలు అప్పగించారు. వీలైనంత త్వరగా తెనాలి నుంచి మరో ప్రాంతానికి వెళితే బాగుంటుందని భావిస్తున్నా.