ప్రజాశక్తి-పాడేరు: ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం రెగ్యులర్ ఉపాధ్యాయుల నియమకాలను చేపట్ట లేదు. దీంతో, ఈ గిరిజన పాఠశాలల్లో సిఆర్‌టిలతోనే విద్యా బోధన చేయిస్తున్నారు. ప్రతి ఏడాది అవసరమైన మేరకు సిఆర్‌టిలను నియమిస్తున్నారు. పాఠశాలల్లో పని చేస్తున్న సిఆర్‌టిలను ఏటా రెన్యువల్ చేయడం అదనంగా మరికొంత మందిని నియమించడం వంటి ప్రక్రియ గిరిజన సంక్షేమ శాఖ చేపడుతోంది.
అల్లూరి జిల్లాలోని పాడేరు ఐటీడీఏ పరిధిలో ప్రస్తుతం 498 మంది సీఆర్టీలు పని చేస్తున్నారు. వీరిలో 250 మంది స్కూల్ అసిస్టెంట్లుగాను, 248 మంది పిఈటి, గ్రేడ్ 2 పండిట్స్, ఎస్జీటీలుగా పని చేస్తున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 420 మంది సీఆర్టీలు ఉన్నారు. వీరిలో 150 మంది స్కూల్ అసిస్టెంట్లుగాను 270 మంది ఎస్జీటీలుగా గిరిజన సంక్షేమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న సిఆర్‌టిలకు జీతం 10 నెలలకే ప్రభుత్వం చెల్లిస్తుంది. సిఆర్‌టిలకు అలవెన్స్‌లు ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో ప్రతినెలా వేతనంలో 50 శాతం నష్టపోతున్నారు. గత 11 ఏళ్లుగా గిరిజన సంక్షేమ పాఠశాలల్లో సీఆర్టీలు ఈ విధంగా వెట్టి చాకిరి చేస్తున్నారు. గిరిజన సీఆర్టీలు ప్రతి ఏటా తమ రెన్యువల్స్, వేతనాల మంజూరు, సర్వీస్ క్రమబద్ధీకరణ కోసం ఐటీడీఏ ముందు ఉద్యమాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూ గిరిజన పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్టీలను రెగ్యులర్ చేయాలని, వెట్టి చాకిరీ నుంచి వారికి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, సిఆర్టిల రెగ్యులరైజేషన్ ప్రధాన డిమాండ్‌గా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) పాడేరులో ఆదివారం విద్యా సదస్సును తలపెట్టింది.










