ప్రజాశక్తి - సాలూరు: ఐటిడిఎ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సిఆర్టీల బదిలీల్లో కార్యాలయ అధికారి ఒకరు కిరికిరి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 117కి తూట్లు పొడిచే ప్రయత్నాలు సాగిస్తున్నారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. నిబంధనల ప్రకారం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులనే నియమించాలి. లేకుంటే 50ఏళ్లు పైబడిన పురుష ఉపాధ్యాయులను నియమించవచ్చు. 35ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులను బాలికల పాఠశాలల్లో నియమించ కూడదనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఐటిడిఎ కార్యాలయం అధికారుల చేతివాటంతో జీవో 117ను నీరుగార్చే ప్రయత్నాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సిఆర్టీల బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్‌లో వారికి నచ్చిన ప్రదేశాలను ఎంపిక చేసుకున్నారు. దాని ప్రకారం వారం రోజుల క్రితం ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. ఈ విధంగా కొంతమంది సిఆర్టీలకు సాలూరు మండలంలోని కురుకూటి, అంటివలస, మావుడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను కేటాయించారు. ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ సిఆర్టీలకు వారు కోరుకున్న పాఠశాలలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి వారం రోజులైంది. అయితే ఆ సిఆర్టీలు ఇంకా బదిలీ ఉత్తర్వులు తీసుకోకుండా తాత్సారం చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఐటిడిఎ పిఒ, గిరిజన సంక్షేమ డిడిలకు తెలియకుండా కార్యాల యం అధికారి ఒకరు ఇష్టారాజ్యంగా డెప్యుటేషన్‌పై వారికి ఇష్టమైన పాఠశాల లకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెరవెనుక పైరవీలు చేసుకుని నచ్చిన పాఠశాలలకు డెప్యుటేషన్ వేయించుకునేందుకు బదిలీ ఉత్తర్వులు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారు. అదే విధంగా బదిలీ ఉత్తర్వులు తీసుకున్న నలుగురు ఎస్‌జిటి సిఆర్టీలు కూడా వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరకుండా పైరవీలు మొదలు పెట్టినట్టు సమాచారం. ఆర్.త్రినాధరావు, డి.విజయకుమారి, ఎస్.మానస, ఎం.వెంకటరావు, కె.నాగ మణి, ఎం.వెంకటరావు అనే సిఆర్టీ స్కూల్ అసిస్టెంట్లకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసినా తీసుకోకుండా జాప్యం చేయడం వెనుక ఆ కార్యాలయం అధికారి అండదండలే కారణమని తెలుస్తోంది. అలాగే పి.గౌరీశంకరరావు, ఆర్.శ్రీనివాసరావు, కందుల సోములు, కుమారి అనే ఎస్‌జిటిలు ఆర్డర్లు అందుకున్నా వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరలేదు. బాలికల పాఠశాలల్లో యువకులైన సిఆర్టీలను నియమించకూడదనే నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు గత కొంతకాలంగా చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహా ప్రయత్నాలను కార్యాలయం అధికారి చేస్తుండడంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.










