ప్రజాశక్తి-గుంటూరు : సిఆర్‌డిఎ పరిధిలో తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని పేదలందరికీ ఇంటి స్థలాల పంపిణీకి స్థలాలను అభివృద్ది చేసి, ప్లాట్‌ల మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఇంటి పట్టాల పంపిణీకి మే 15 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక ప్రకారం సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులను గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. సిఆర్‌డిఒ పరిధిలో ఏర్పాటు చేసే లేఅవుట్ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు నియమించిన ప్రత్యేక అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రత్యేక బృందాల్లోని ఇంజినీరింగ్, సర్వే, అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం సమావేశమయ్యారు. పెదకాకాని, తుళ్లురు, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పేదలందరికీ ఇళ్ల పథకం లబ్ధిదారులు దాదాపు 20 వేల మందికి ఇంటి స్థలాల కేటాయింపునకు మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, ఐనవోలు గ్రామాల్లో 10 లే అవుట్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 15వ తేదీలోపు లే అవుట్‌లలో అభివృద్ధి పనులు, రహదారుల ఏర్పాటు, ప్లాట్‌ల మార్కింగ్ చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీకి సిద్ధం చేయాల్సి వుందన్నారు. పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణశర్మ, డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, ట్రైనీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సాయిశ్రీ, మోవిడ వాణి, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ సాయినాథ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










