ప్రజాశక్తి-ఉక్కునగరం : సిఐటియుతో కార్మిక హక్కులకు రక్షణ కలుగుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.నర్సింగరావు, ఎంఎ.గఫూర్ పేర్కొన్నారు. స్టీల్ సిఐటియు 40వ వార్షికోత్సవం సందర్భంగా ఉక్కునగరం స్టీల్ క్లబ్‌లో 'స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ- కార్మికుల కర్తవ్యం' అనే అంశంపై గురువారం సెమినార్ నిర్వహించారు. ముందుగా స్టీల్‌ప్లాంట్‌లో ఇటీవల మృతి చెందిన కార్యకర్తలకు, ఉద్యోగులకు, యూనియన్ నాయకులకు నివాళులర్పించారు. సదస్సుకు ముఖ్య వక్తగా ఎంఎ.గఫూర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రయివేటీకరణ జరిగితే పెద్ద ప్రమాదమన్నారు. అన్ని రంగాలూ ప్రయివేటు పరం అయితే కార్పోరేట్ శక్తులు ఇష్టానుసారం ధరలు పెంచుకుంటాయని వివరించారు.
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ, నిబద్ధత కలిగిన కార్యకర్తలే సిఐటియు బలోపేతానికి కారణమన్నారు. పదవులులేకుండానే స్టీల్‌ప్లాంట్‌లో సిఐటియు బలోపేతానికి పనిచేసి విరమణ పొందిన ఉద్యోగులు ఎంతో మంది ఇప్పటికీ సిఐటియు కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఆ బలంతోనే స్టీల్ సిఐటియు అనేక ఉద్యమాల్లో విజయం సాధించిందని చెప్పారు. సిఐటియు కాలంలో ఏ ఒక్క ప్రయోజనాన్నీ కార్మికులు కోల్పోలేదని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ సామర్థ్యానికి తగిన ఉత్పత్తి సాధించడం ద్వారానే లాభాలలో పయనిస్తుందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణలో పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం ప్రతి కార్మికుడినీ చైతన్య పరచడం ప్రధాన కర్తవ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం పాలించడం మాత్రమే తమ అజెండాగా చెప్పుకుని, ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించి దేశాన్ని అధోగతి పాల్జేస్తోందని విమర్శించారు. రైతులు చేసిన పోరాటం వల్లనే విజయం వారి కాళ్లవద్దకు వెళ్లిందన్నారు. ఇప్పటి వరకూ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ జరుగుతోందని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ సంస్థల జోలికొస్తే ఎలాంటి పరిణామలైనా ఎదుర్కోవడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు.
జివిఎంసి 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి వైటి.దాస్, ఎన్.రామారావు, జ్యోతీశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సమర్థిస్తున్న వారికి బుద్ది చెప్పాలన్నారు. ప్రజాధనంతో ఏర్పాటైన పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగినప్పుడే రిజర్వేషన్లు అమలై అన్ని వర్గాల ప్రజలు అభివృద్దివైపు నడుస్తారని తెలిపారు. ప్రయివేటీకరణ దిశగా వెళ్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు ఐక్యంగా పోరాడినప్పుడే నిజమైన కార్మిక రాజ్యం ఏర్పడుతుందన్నారు. స్టీల్ సిఐటియు అధ్యక్షులు జె.అయోధ్య రామ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సిఐటియు నాయకులు కెఎం.శ్రీనివాస్, పి.శ్రీనివాసరాజు, యు.రామస్వామి, బి.అప్పారావు, యు.వెంకటేశ్వర్లు, గంగాధర్, కెవి.సత్యనారాయణ, నీలకంఠం, వి.ప్రసాద్, మరిడయ్య, టివికె.రాజు, నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు.










