ప్రజాశక్తి - పెద్దాపురం, సామర్లకోట రూరల్
సిఎం జగన్ పర్యటన నేపథ్యంలో పెద్దాపురం, సామర్లకోటలో సిఐటియు నాయకులు పోలీసులు గృహనిర్బంధం చేశారు. పెద్దాపురంలో సిఐటియు జిల్లా నాయకులు దారపురెడ్డి క్రాంతికుమార్, సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబులను, సామర్లకోటలో సిఐటియు జిల్లా నాయకులు బాలం శ్రీనివాస్‌ను పోలీసులు గురువారంఉదయం నుంచే గృహనిర్బందం చేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా గృహనిర్బంధం చేసి వారి ఇళ్ల వద్ద పోలీసులను పహరా పెట్టారు. ఈ నిర్బంధాలను సిఐటియు, సిపిఎం, ఇతర ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా, అప్రజాస్వామికంగా ఉందని సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, కాకినాడ నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు ఒక ప్రకటనలో ఖండించారు. నాయకులు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నా ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం చాలా దారుణమన్నారు. ముఖ్యమంత్రి సభకు ఎవరైనా చట్టవిరుద్ధంగా ఆటంకం కల్పిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు గాని, ఇలా నిర్బంధాలతో మానవ హక్కులకు భంగం కలిగించడం తగదన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా రాష్ట్ర ప్రభుత్వ పోలీసు చర్యలను ఖండించాలన్నారు. ప్రతిపక్షాలను, కార్మిక సంఘాలను అణచివేయాలనుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, సిరపరపు శ్రీనివాస్,కేదారి నాగు అన్నారు. ఈ రెస్టులను టిడిపి సామర్లకోట పట్టణ కార్యదర్శి బడుగు శ్రీకాంత్ రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షులు రాయుడు మోజెస్‌బాబు తదితరులు ఖండించారు. ప్రభుత్వ యంత్రాంగం వైఖరి మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సిపిఎం నాయకులు కరణం గోవిందరాజు, సురేష్, మహేష్ హెచ్చరించారు.
ప్రజాస్వామ్య హక్కులకు భంగం : సిపిఎం
సిఎం జగన్ పర్యటన సందర్బంగా సిపిఎం పెద్దాపురం నియోజకవర్గం నాయకులను గహ నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్య హక్కులకు భంగం కల్గించడమేనని సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ ప్రకటనలో విమర్శించారు. మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలు ఉన్నపుడల్లా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పౌరులకున్న ప్రాథమిక హక్కులను ఈ ప్రభుత్వం హరిస్తుందన్నారు.










