ప్రజాశక్తి - నిడమర్రు
వచ్చేనెల 2, 3, 4 తేదీల్లో భీమవరంలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాసభ వాల్‌పోస్టర్లను స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణరావు మాట్లాడుతూ మహాసభ తొలిరోజు జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంచ వరప్రసాద్, టి.వెంకటేశ్వరరావు, ఎస్.రాంబాబు, బి.సుజాత, వి.సుబ్బారావు. కె.వెంకటరత్నం పాల్గొన్నారు.
కామవరపుకోట : సిఐటియు రాష్ట్ర 16వ మహాసభను జయప్రదం చేయాలని కెవిపిఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. సోమవారం కామవరపుకోట మండల కేంద్రంలో సిఐటియు 16వ రాష్ట్ర మహాసభ కరపత్రాలను పంపిణీ చేశారు అలాగే ఆటో కార్మికులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగాఫ్రాన్సిస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. కార్మిక సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెంచిన డీజిల్ రేటు తగ్గించి ఆటో కార్మికులకు ఇళ్ల స్థలాలు, కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్‌కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్, మధ్యాహ్న భోజనకార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, విఆర్‌ఎ, విఆర్‌ఒ, 104, 108 ఉద్యోగుల, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కె.లక్ష్మణరావు, వెంకటేశ్వరావు, శ్రీనివాస్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు రత్నకుమారి, శిరీష రాణి పాల్గొన్నారు.
కలిదిండి : సిఐటియు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ కలిదిండి పంచాయతీ కార్యాలయం వద్ద ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించారు. బహిరంగ సభకు కార్మికలందరూ తరలివచ్చేలా సిఐటియు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సిఐటియు మండల కార్యదర్శి చిన్నం శ్రీకాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి శేషపు మహంకాళిరావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు యలవర్తి రమేష్, నాని, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు గూట్ల జయరాజు, శీలబోయిన సుబ్రహ్మణ్యం, కాలువ శ్రీను, షేక్ ఖాసింబాబు, జి.రంగారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పరసా రాజేష్, పోతురాజు బాలాజీ, కటికల శ్రీను, షేక్ అక్బర్ పాల్గొన్నారు.










