Dec 23,2022 21:53

ప్రజాశక్తి - ఆగిరిపల్లి
వచ్చేనెల రెండు, మూడు, నాలుగు తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే సిఐటియు రాష్ట్ర 16వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు జి.రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో సిఐటియు రాష్ట్ర మహాసభ కరపత్రాలను పంపిణీ చేవారు. అనంతరం కుశలవ ఇంటర్నేషనల్‌ కంపెనీ వద్ద కార్మికుల మధ్య గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆగిరిపల్లి మండల ప్రధానకార్యదర్శి ఆర్‌.చంటి, కుశలవ యూనియన్‌ నాయకులు ప్రసాద్‌, నరేష్‌, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
నిడమర్రు : సిఐటియు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ భువనపల్లిలో సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు మాట్లాడుతూ. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వచ్చేనెల రెండు, మూడు, నాలుగు తేదీల్లో జరిగే ఈ మహాసభకు కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గవర సత్యనారాయణ, లింగబరి లక్ష్మణరావు, ప్రగడ మణికంఠ, దండుపాటి బాలాజీ, శ్రీను, వినరు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : సిఐటియు రాష్ట్ర 16వ మహాసభ జయప్రదం చేయాలని అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌
జిల్లా ప్రధాన కార్యదర్శి పి.భారతి పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం జి.విమల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భారతి వాల్‌పోస్టర్లను పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాల అమలు చేయడం లేదన్నారు. నూతన విద్యా విధానంతో అంగన్వాడీ సెంటర్లను విలీనం చేసి వర్కర్స్‌కి ఇబ్బంది కలిగే విధానాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తుందని ఆవేదనచెందారు. అనంతరం అంగన్వాడీ ప్రాజెక్టు నూతన కమిటీని 16 మందితో ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షులుగా శుక్లబోయిన రాంబాబు, అధ్యక్షులుగా జి.విమల, కార్యదర్శిగా ఎ.నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్‌కె.సుభాషిని, సిఐటియు నాయకులు జి.విజయలక్ష్మి, ఎస్‌.రాంబాబు, జి.విజయకుమారి, లక్ష్మీదేవి, విజయనిర్మల, సత్యవేణి పాల్గొన్నారు.
భీమడోలు:కొత్త ఏడాది పోరాటాల సంవత్సరంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు అభివర్ణించారు. సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ పోరాడాల్సి ఉందని, వీరికి సిఐటియు అండగా నిలుస్తుందని తెలిపారు. సిఐటియు రాష్ట్ర 16వ మహాసభ గోడపత్రికను స్థానిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ఒప్పంద, పొరుగు సేవలు కార్మికులతో కలిసి శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. వచ్చేనెల రెండు, మూడు, నాలుగు తేదీల్లో భీమవరంలో జరిగే ఈ సభలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి సాల్మన్‌రాజు, స్టేషన్‌ కార్మికులు బాజీ, నాగేశ్వరరావు, మోహన్‌ పాల్గొన్నారు.
కైకలూరు రూరల్‌ : సిఐటియు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కె.లాజర్‌ పిలుపునిచ్చారు. స్థానిక సంఘ కార్యాలయం వద్ద మహాసభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సభకు ఉద్యోగ, కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కార్యచరణ రూపొందిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా, భవన నిర్మాణ, ఆటో వర్కర్స్‌, విద్యుత్‌, తపాలా, ఎల్‌ఐసి, టెలికాం కార్మికులు పాల్గొనాలని ఆయన కోరారు.