చైతన్య ప్రచార యాత్రకు ఘన స్వాగతం
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
జనవరి 2, 3, 4 తేదీల్లో భీమవరంలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభల్లో టిటిడి అటవీ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రత్యేక అజెండా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజరుకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై ప్రధానంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. కుప్పంలో బుధవారం ప్రారంభమైన సిఐటియు రాష్ట్ర చైతన్య ప్రచార జాత పలమనేరు, చిత్తూరు మీదుగా సాయంత్రానికి తిరుపతి చేరుకుంది. ఫారెస్టు కార్మికుల రిలేదీక్షా శిబిరం వద్ద కార్మికులు జాతాకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అజరుకుమార్ మాట్లాడుతూ టిటిడి ఫారెస్టు కార్మికులు రెండేళ్లకు పైగా చేస్తున్న ఈ పోరాటం రాష్ట్ర కార్మిక ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. టిటిడిలో ఫారెస్టు, కాంట్రాక్టు కార్మికులే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ కార్మికులకు సంబంధించి సమస్యలపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించే దిశగా భవిష్యత్ ఉద్యమాలు ఉంటాయన్నారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ కష్టపడి సంపద సృష్టించిన కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, కనీస వేతనం 26వేలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేస్తోందన్నారు. కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరలేదని, సమానపనికి సమాన వేతనం కోరుతున్నారని చెప్పారు. న్యాయమైన కోర్కెలు పరిష్కరించే ఓపిక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేదన్నారు. ఉద్యమాల ద్వారా వత్తిడి తెచ్చి హక్కులను సాధించుకోవాలన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 29 హక్కులను రద్దు చేసి లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కటారి అజరుకుమార్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా పనిచేస్తున్న టిటిడి కార్మికులు తమకు టైంస్కేల్ ఇవ్వాలని రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు టిటిడి అధికార యంత్రాంగానికి బుద్ధి లేదన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ భీమవరంలో జరిగే రాష్ట్ర మహాసభలకు సిఐటియు అఖిల భారత అధ్యక్ష కార్యదర్శులు తపన్‌సేన్, హేమలత, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ నర్శింగరావు, గఫూర్‌లతో పాటు కేరళ కార్మిక మంత్రి హాజరై రాష్ట్రంలో అధికారం రాకముందు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలపై పెద్దఎత్తున నిలదీస్తారన్నారు. టిటిడి అటవీ కార్మికులు చేస్తున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా ఆరోజు బహిరంగసభలో ఉంటుందన్నారు. ఓ సంస్థలో 180 రోజులు పనిచేస్తే పర్మినెంట్ చేయాలని, టిటిడి అటవీ కార్మికులు 30 ఏళ్లుగా పనిచేస్తున్నారని, పాలకమండలి తీర్మానాన్ని అమలు చేయాలని 780 రోజులుగా రిలేదీక్షలు చేస్తున్నా సిగ్గులేకుండా రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏ కష్టమొచ్చినా శ్రీవారికి చెప్పుకునేందుకు భక్తులు వస్తారని, దేవుని సన్నిధిలో పనిచేస్తున్న టిటిడి అటవీ కార్మికులకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాలేదన్నారు. టిటిడి ఫారెస్టు కార్మికుల సంఘం నాయకులు సురేష్ తాము చేస్తున్న ఆందోళన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి యాజమాన్యం ఏవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు జిబిఎస్ మణ్యం, చిత్తూరు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.చైతన్య, సురేంద్రన్, తిరుపతి జిల్లా సిఐటియు నాయకులు ఎంఎన్ ప్రసాద్‌రావు, టి.సుబ్రమణ్యం, వేణు, బాలాజీ, బుజ్జమ్మ, ఆర్.లక్ష్మి, మాధవ్‌కృష్ణ, జయంతి, రఘు, జెవికెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌రావు, ఫారెస్టు నాయకులు మల్లికార్జున, పురుషోత్తం, ఈశ్వర్‌రెడ్డి, మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతా అన్నమయ్య జిల్లా పీలేరుకు బయల్దేరి వెళ్లింది.
కార్మిక చైతన్య యాత్ర డిమాండ్లు
- లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి.
- కార్మికులందరికీ కనీస వేతనం నెలకు 26వేలు అమలు చేయాలి.
- కార్మికులందరికీ బోనస్, పిఎఫ్, ఈఎస్‌ఐ గ్రాట్యూటీ చెల్లించాలి.
- స్కీమ్ వర్కర్స్ ను కార్మికులుగా గుర్తించాలి. సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యూటీని అమలు చేయాలి.
- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డు కార్యకలాపాలు పునరుద్ధరించాలి.
- హమాలి, ఆటో, ప్రైవేట్, ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమగ్ర చట్టం చేయాలి.
- కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి
- విశాఖ స్టీల్ తో సహా కోర్టులు, రైలు, విద్యుత్ రంగాలను అమ్మటాన్ని అడ్డుకుందాం.
-మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం.
- నిత్యవసర వస్తువులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అరికట్టాలి.










