Dec 19,2022 22:27

ప్రజాశక్తి - ఏలూరు
             సిఐటియు 16వ రాష్ట్ర మహాసభ సందర్భంగా జనవరి 2న భీమవరంలో ప్రదర్శన, బహిరంగసభలను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ సిఐటియు 16వ మహాసభ మొట్టమొదటిసారిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతుందన్నారు. ఈ మహాసభలో రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం కార్మిక సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని వాగ్దానం చేసి మాట తప్పారన్నారు. సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తానని ఇచ్చిన హామీ అమలు చేయకుండా దాటవేత వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఐవి.సుధాకర్‌, పి.భారతి, కె.విజయలక్ష్మి, నగర అధ్యక్ష కార్యదర్శులు బి. జగన్నాథం, వి.సాయిబాబు, నేతలు సుజాత, హైమావతి పాల్గొన్నారు.
ముసునూరు: భీమవరంలో జరగనున్న సిఐటియు 16వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ముసునూరులో మహాసభ వాల్‌పోస్టర్‌ను సిఐటియు జిల్లా కార్యదర్శి జి.రాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి కోడవలి శ్రీనివాసరావు, నేతలు పిల్లి మురళీ, కంచర్ల దుర్గారావు, కంచర్ల పోతురాజు, కంచర్ల శ్రీను, కొల్లి శ్రీను, కె.శ్రీను, పి.ఏడుకొండలు, కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.