Dec 02,2022 22:44

2న భారీ ప్రదర్శన, బహిరంగ సభ
 హాజరుకానున్న కేరళ సిఎం పినరయి విజయన్‌
 సిఐటియు 16వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలి
 ఐదు రోజులపాటు సాంస్కృతిక ప్రదర్శనలు, సెమినార్లు
 మహాసభ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి
 మహాసభ నిర్వహణకు అంతా సహకరించాలి
 సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి - భీమవరం

          సిఐటియు ఆవిర్భవించాక తొలిసారి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనవరి 2, 3, 4 తేదీల్లో సిఐటియు 16వ రాష్ట్ర మహాసభ నిర్వహించనున్నామని, ఈ సందర్భంగా రెండో తేదీన భారీ కార్మిక, ప్రజా ప్రదర్శన నిర్వహించనున్నట్లు మహాసభ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ తెలిపారు. బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హాజరు కానున్నారని, ఈ సందర్భంగా 70 వేల మందితో ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మిక, ఉద్యోగుల హక్కులు హరించే విధానాలు అవంలంబిస్తోందని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ రూ.15 వేల నుంచి రూ.16 వేలకు మించి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. సుమారు మూడు లక్షల మంది కార్మికులకు రూ.11 వేలకు మించి వేతనం రావడం లేదన్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారం చేపట్టి మూడున్నరేళ్లు గడిచినా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల హక్కులను కాలరాశారని విమర్శించారు. విద్యుత్‌ ప్రయివేటీకరణతోపాటు అన్ని రంగాల ప్రయివేటీకరణకు కేంద్రం దుందుడుకుగా ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన 11 హామీలు నేటికీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పెట్రో కారిడార్‌ వంటివి వచ్చేవని, తద్వారా ఉద్యోగావకాశాలు పెరిగేవన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వాల హయాంలో ఆందోళనలపై నిర్బంధం పెరిగిందని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటిపై మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులను సంఘటితపర్చి పోరుబాటలో నిలిపేది సిఐటియు ఒక్కటేనన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను రద్దు చేసి యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చారన్నారు. సుమారు 18 ఏళ్ల నుంచి ఏప్రభుత్వమూ కనీస వేతన సవరణ చేయలేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న టిడిపిగానీ, గత మూడున్నరేళ్లలో వైసిపి ప్రభుత్వంగాని కనీస వేతన సవరణ ఊసే మరిచాయన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన రూ.12 వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా మళ్లించిందని, వాటిని వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతుంటే నిర్బంధం విధిస్తున్నారని విమర్శించారు. మహాసభలో మూడేళ్ల కాలంలో జరిగిన పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలపై చర్చించి రానున్నకాలంలో చేపట్టాల్సిన ఉద్యమాలకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. భారీ ప్రదర్శన, బహిరంగ సభకు ముందు ఐదు రోజులపాటు పట్టణంలో సాంస్కృతిక ప్రదర్శనలు, సెమినార్లు నిర్వహిస్తామన్నారు. మహాసభ జయప్రదానికి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడుతూ మల్టీప్లెక్స్‌ వెనుక ఉన్న అల్లూరి శ్రీరామరాజు కల్యాణ వేదికలో ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు మాట్లాడుతూ మహాసభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. సమావేశంలో ఆహ్వాన సంఘం కోశాధికారి బి.వాసుదేవరావు పాల్గొన్నారు.