Mar 19,2023 23:37

మాధవరావు, వెంకటలక్ష్మిలకు నోటీసులిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి - ఎటపాక :జిఒ 1 రద్దు, ఇతర అంగన్వాడీ సమస్యలపై ఈనెల 20న సిఐటియు చలో విజయవాడ ఆందోళన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా సిఐటియు మండల కార్యదర్శి డేగల మాధవరావును ఎటపాక పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఎటపాకలో తన నివాసంలో ఉన్న మాధవరావును ఎటపాక పోలీసులు స్టేషన్‌కు తరలించి మధ్యాహ్నం ఒంటి వరకు నిర్భందించి, తర్వాత సిఆర్‌పిసి 41 నోటీసులు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం వరకు గృహ నిర్భంధంలో ఉండాలంటూ ఆదేశాలిచ్చారు.
ఈ సందర్బంగా డేగల మాధవరావు మాట్లాడుతూ నిర్బంధం, అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేరని, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే కార్మికులను అరెస్ట్‌ చేయడం పిరికిపంద చర్య అన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా అంగన్వాడీల ఛలో విజయవాడ విజయవంతమౌతుందన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించేవరకు సిఐటియు పోరాటం కొనసాగుతుందన్నారు.
రాజవొమ్మంగి: అంగన్వాడి ల సమస్యలు పరిష్కరించాలంటూ ఈనెల 20న సిఐటియు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో విజయ కార్యక్రమం నేపథ్యంలో ఆదివారం సిఐటియు నాయకులు పి రామరాజు, అంగన్వాడీ యూనియన్‌ మండల నాయకురాలు కె.వెంకటలక్ష్మి ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చారు, వారితో బాటూ మరి కొంత మందికి నోటీసులు ఇచ్చి విజయవాడ ధర్నాలో పాల్గొనరాదని ఆదేశాలు జారీ చేశారు,ధర్నాకు ఎటువంటి పర్మిషన్లు లేవని నాయకులు,అంగన్వాడి వర్కర్లు ధర్నాకు వెల్లకూడదని తెలిపారు. ఈ చర్యలను పలువురు ప్రజా సంఘాలు నాయకులు లోతా రామారావు తదితరులు తీవ్రంగా ఖండించారు.
అరకులోయరూరల్‌:అంగన్వాడీలు చలో విజయవాడ పిలుపు ఇవ్వడంతో మండలంలోని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పొద్దు బాలదేవ్‌ను ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. విజయవాడ వెళ్తే అరెస్టు చేసి కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పొద్దు బాలదేవ్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి, ఆశా కార్యకర్తలను ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేయడం సరికాదన్నారు. అంగన్వాడి ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయాలని కోరితే గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం మండిపడ్డారు.