Jun 06,2023 00:22

సంస్మరణ సభలో మాట్లాడుతున్న జగ్గునాయుడు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఇటీవల మరణించిన సిఐటియు సీనియర్‌ నాయకులు ఉప్పిలి కన్నారావుకు సిపిఎం, సిఐటియు విశాఖ, అనకాపల్లి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం అగనంపూడిలోని కన్నారావు స్వగృహంలో జరిగిన సంస్మరణ సభకు హాజరై విప్లవ వందనాలు అర్పించారు. సంస్మరణ సభలో 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, కార్పొరేట్‌ ఆసుపత్రుల ధనదాహానికి కన్నారావు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గుండెకు సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థలో ఏర్పడిన లోపానికి సక్రమంగా వైద్యం చేయకుండా బలి తీసుకున్నారన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ, ఉక్కు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అసంఘటిత, సంఘటిత కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. కన్నారావు మృతి సిపిఎం, సిఐటియుకు తీరని లోటన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ, అగనంపూడిలో పార్టీ బలోపేతానికి కన్నారావు చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చి అనేక సభలు, సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సిపిఎం, సిఐటియు తరపున అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి లోకనాథం, స్టీల్‌ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్‌, పివిఎస్‌బి.శ్రీనివాసరాజు, నీలకంఠరావు, ఉరిటి మరిడయ్య, విడివి పూర్ణచంద్రరావు, గంగాధర్‌, డిసిహెచ్‌ వెంకటేశ్వరరావు, వైసిపి నాయకులు పూర్ణానందశర్మ, బలిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.