ప్రజాశక్తి-మారేడుమిల్లి
సిఐటియు మారేడుమిల్లి మండల నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం సిఐటియు జిల్లా నాయకులు మట్ల వాణిశ్రీ అధ్యక్షతన జరిగింది. సీఐటియూ మండల అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్.రత్నకుమారి, బి.దాసు, ఉపాధ్యక్షులుగా జి.జగన్, సహాయ కార్యదర్శిగా జి.కిషోర్, కోశాధికారిగా ఈ.సిరిమల్లె రెడ్డి, మరో 12 మంది కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం.వాణిశ్రీ, పి.రామరాజు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరిస్తున్నాయన్నారు. కార్మికుల సమస్యలను గాలికొదిలేసి బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. కనీస వేతనాలు అమలు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం స్కీం వర్కర్లు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మండలంలో నెలకొన్న అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ పోరాటాలు ఉధృతం చేయాలని కోరారు.










