ప్రజాశక్తి - పరవాడ
పరవాడలో ఈ నెల 18, 19 తేదీల్లో జరుగు సిఐటియు అనకాపల్లి జిల్లా 12వ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సిఐటియు మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ఫార్మసిటీలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు జిల్లా మహాసభ మొట్టమొదటిసారి పరవాడలో జరుగుతుందని, ఈ నెల 18న ఉదయం 10 గంటలకు పరవాడ ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్ నుంచి సంతబయలు వరకు భారీ కార్మిక ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. ఈ బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి కె.స్వరూప రాణి, జిల్లా నాయకులు ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం రెండు రోజులు పాటు పరవాడ సీతారామ కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. బహిరంగ సభకు కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్మిక చట్టాలు అమలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు తదితర సమస్యలపైనా, స్కీం వర్కర్లు, అసంఘటితరంగ కార్మికుల హక్కులకై సిఐటియు రాజీలేని పోరాటాలు నిర్వహించినట్లు చెప్పారు.
మహాసభ పోస్టర్లు ఆవిష్కరణ
అనకాపల్లి : పరవాడలో ఈనెల 18, 19 తేదీల్లో జరిగే సిఐటియు జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బుధవారం హైర్ బస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలక సత్యనారాయణ మాట్లాడుతూ కార్మిక వర్గ పోరాటాలకు సిఐటియు మహాసభ దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి చిన్నారావు, అప్పారావు, జి వాసు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దేవరాపల్లి : సిఐటియు జిల్లా మహాసభ పోస్టర్‌ను సిఐటియు మండల కార్యదర్శి, ఐకెపి యునియన్ జిల్లా అధ్యక్షులు కె.సూరిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న తదితరులు బుధవారం దేవరాపల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలో భవిష్యత్ ఉద్యమాలకు రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సృజన అప్పారావు, లక్ష్మి, లీలా, వరలక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు.










