Dec 18,2022 23:16

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిఐటియు నేతలు

ప్రజాశక్తి- పెందుర్తి : ఈనెల 22,23 తేదీల్లో విశాఖలోని అల్లూరి విజ్ఞానకేంద్రంలో నిర్వహించే సిఐటియు విశాఖ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జగన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పెందుర్తిలోని యూనియన్‌ కార్యాలయంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్‌ పోరాట కార్యాచరణ రూపొందిస్తారని, అధికసంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌తోపాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని, అసంఘటితరంగ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు, 44 కార్మికచట్టాలను రద్దుచేసి అమల్లోకి తెచ్చిన నాలుగు కార్మిక కోడ్స్‌ రద్దు ఇతర సమస్యలపై ఐక్యపోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలుకుతున్న రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక, రైతు, ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జోన్‌ కార్యదర్శి రమణి, సిఐటియు నేతలుశంకరరావు, అప్పలనాయుడు, జగన్నాథం, స్వామి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : సిఐటియు విశాఖ జిల్లా 12వ మహాసభల వాల్‌పోస్టర్లను జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ మాట్లాడుతూ కార్మిక సమస్యలపై సిఐటియు నిరంతరం పోరాడు తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ముఠా, తోపుడుబళ్లు, ఆటో, భవన నిర్మాణరంగ కార్మికులకు సమగ్ర చట్టం చేసి, సంక్షేమ బోర్డు ద్వారా ఆదుకోవాలని కోరారు. వివిధ స్కీమ్స్‌లో పనిచేస్తున్న ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం పథకం, విఒఎలు, తదితర స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పర్మినెంట్‌ చేయాలన్నారు. విశాఖ జిల్లాలో 50 వేల మంది కార్మికుల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ, 400 మంది వివిధ రంగాలు, సంఘాల నేతలుఈ మహాసభలో పాల్గొంటారన్నారు. మహాసభలకు ముఖ్య అతిధులుగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నరసింగరావు, కార్యదర్శి కె. ఉమా మహేశ్వరరావు, ఎం. జగ్గునాయిడు తదితరులు హాజరవుతారాన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై.రాజు, టి.నూకరాజు, కె. నరసింగరావు, ఎం. సూరీడు పాల్గొన్నారు.