Nov 23,2022 23:51

మాట్లాడుతున్న సిఐటియు నాయకులు అప్పలనాయుడు

ప్రజాశక్తి-కొయ్యురు : సిఐటియు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రథమ మహాసభ డిసెంబర్‌ 20, 21 తేదీల్లో పాడేరులో జరుగుతుందని, ఈ మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు వై.అప్పలనాయుడు పిలుపునిచ్చారు. మండలం నడింపాలెం అంగన్వాడీ సెక్టార్‌ సమావేశం బుధవారం జరిగింది. ఇందులో పాల్గొన్న అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. అంగన్వాడీ వర్కర్ల పనిభారం పెరిగిందని, అనేక యాప్‌లతో తంబులు వేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెన్షన్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ఉద్యోగ భద్రత కల్పించాలని అనేకసార్లు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా చట్టాలను మార్పు చేశారని విమర్శించారు. ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్‌ వర్కర్ల సమస్యలు ఈ మహాసభలో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు వి.వెంకట లక్ష్మి, దేవుడమ్మ, నూకరత్నం, సత్యవతి, రాజేశ్వరి, దేవుడమ్మ, భారతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.