ప్రజాశక్తి - పరవాడ
పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందిన పరవాడలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న సిఐటియు అనకాపల్లి జిల్లా 12వ మహాసభకు సంబంధించి వాల్ పోస్టర్లను ఆ సంఘం జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, కోశాధికారి వివి.శ్రీనివాసరావు తదితరులు శుక్రవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్ల సమస్యలపైనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ మహాసభలో చర్చించి, భవిష్యత్ పోరాటాలకు కార్యా చరణ రూపొందించనున్నట్లు చెప్పారు. నేడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, కార్పొరేట్ కంపెనీలకు కార్మిక హక్కులను తాకట్టు పెడు తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక పోరాటాలపై నిర్బంధా న్ని ప్రయోగిస్తుందని, కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని తెలిపారు. పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి 11 ఏళ్లు అవుతున్నా నేటికీ వేతన సవరణ చేయడం లేదని, దీంతో జిల్లాలో 3 లక్షల మంది కార్మికులకు వేతనాలు పెరగలేదని చెప్పారు. మహాసభ సందర్భంగా ఈ నెల 18న జరుగు బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శి స్వరూపరాణి ప్రసంగిస్తారని, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.










