Dec 17,2022 23:40

పరవాడలో బైక్‌ ర్యాలీలో నినాదాలు చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి- పరవాడ
ఈ నెల 18, 19 తేదీల్లో పరవాడలో జరగనున్న సిఐటియు 12వ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం స్థానిక సినిమా హాల్‌ సెంటర్‌లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకర్రావు మాట్లాడుతూ సిఐటియు మహాసభలు పారిశ్రామిక ప్రాంతమైన పరవాడలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహాసభను పురస్కరించుకొని 18వ తేదీన స్థానిక తహశీల్దారు కార్యాలయం నుంచి భారీ ప్రదర్శన, భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలో కార్మిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. 24 మండలాల నుండి 20 రంగాలకు చెందిన కార్మిక ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతాయని తెలిపారు. బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు, కార్యదర్శి స్వరూపరాణి ముఖ్య వక్తలుగా ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ ర్యాలీ, బహిరంగ సభలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, మండల నాయకులు ఎడ్ల బాబ్జీ, కృష్ణ, కన్నూరు నాయుడు, గేదెల అప్పారావు, సిహెచ్‌.ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.
దేవరాపల్లి : సిఐటియు జిల్లా మహసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన శనివారం దేవరాపల్లిలో కార్మికులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి, ఐకెపి యునియన్‌ జిల్లా అద్యక్షులు కె.సూరిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న మాట్లాడుతూ ఈ మహసభల్లో ఆశా, అంగన్వాడీ, విఆర్‌ఎ, విద్యుత్‌, కో-ఆపరేటివ్‌, మధ్యాహ్నం భోజన కార్మికులు విఓఎ వంటి స్కీం వర్కర్లు సమస్యలతో పాటు అసంఘటిత కార్మికులు, కాంట్రాక్టు ఆవుట్‌ స్టోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టి.అప్పారావు, కె.అప్పారావు, రాము, అప్పలనాయుడు, లక్ష్మీ రాజు తదితరులు పాల్గొన్నారు.