ప్రజాశక్తి-ఉక్కునగరం : సిఐటియు బలోపేతానికి కృషిచేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సిఐటియు స్థాపించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలుచోట్ల యూనియన్ పతాకాలను ఎగురవేశారు. స్టీల్ సిఐటియు ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో స్టీల్ సిఐటియు పూర్వాధ్యక్షులు ఎం.కృష్ణారావు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారంలో సిఐటియు స్థాపించింది మొదలు ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌లో నేడు కార్మికులుకు అందుతున్న అనేక ప్రయోజనాలు సిఐటియు ముందు చూపుతో చేసినవేనని వివరించారు. ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించిన తొలినాళ్లలోనే ''న్యూ వర్క్ కల్చర్''తో ఉపాధిని దెబ్బతీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, దానిని ఎదుర్కొని, విస్తరణపై అవగాహన కల్పించి తద్వారా నూతన ఉపాధిని కల్పించిన ఘనత సిఐటియుకు దక్కుతుందని స్పష్టం చేశారు. నేడు జరుగుతున్న ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటంలో సిఐటియు కీలక పాత్ర పోషిస్తోందని, దీనిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ, ఇక్కడ సిఐటియు స్థాపన సమయంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కుంటూ కార్మిక వర్గం చేసిన కృషి వల్లే నేడు ఈ స్థితికి యూనియన్ చేరిందని తెలిపారు. కార్యకర్తల నిస్వార్థ, అవిశ్రాంత పోరాటాలే యూనియన్ అభివృద్ధికి కారణమని స్పష్టం చేశారు. ఇది మరింత బలోపేతం కావడం ద్వారా ఐక్య ఉద్యమాలు మరింత పెరిగి ప్రజా ఉద్యమాలుగా మలచడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీని కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గంగాధర్ సభాధ్యక్షులుగా సాగిన కార్యక్రమంలో సిఐటియు నాయకులు జగ్గారావు, బి.తౌడన్న, సూరిబాబు, వి.మురళి, డిఎస్‌వి.శ్రీనివాస్, సంజీవరావు, పీజీకే రాజు, కె.శ్రీనివాస్, కె.సత్యనారాయణ, శ్రీనివాస్, వి.ప్రసాద్, బి.సత్యనారాయణ, వివిధ విభాగాల కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు.
గాజువాక : పెదగంట్యాడలోని సిఐటియు కార్యాలయం వద్ద యూనియన్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు ఎన్.రామారావు మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌లో సిఐటియు ఏర్పడ్డాక ఎన్నో ఉద్యమాలు చేసి కార్మికుల హక్కులు సాధించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు, రామస్వామి, కణితి అప్పలరాజు, కె.అప్పలరాజు, పాల అప్పలరెడ్డి, పాల వెంకయ్య, బి.గురప్ప, జి.శ్రీనివాస్, నమ్మి రమణ, శ్రీనివాస్, శంకర్, పిట్ట గురునాథ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.










