Jun 19,2023 01:16

రక్తదానం శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎసిఎల్‌, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు: ప్రపంచ రక్తదాన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో లైన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సుభాని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ సిఐటియు ఆర్థిక పోరాటాలే కాకుండా సామాజిక, ఆరోగ్యపరమైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. కరోనా సమయంలోనూ, ప్రమాదాలు జరిగిన ప్పుడు వెంటనే స్పందించి రక్తదానం చేయడంలో సిఐటియు ముందుం టుందని తెలిపారు. అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ మాట్లాడుతూ సిఐటియు చేస్తున్న కృషి అభినందనీయమని, భవిష్యత్తులో దీన్ని కొనసాగించాలని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఒకరు రక్తదానం చేయటం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. రక్తదానంపై ఉన్న అపోహను తొలగించేందుకు సిఐటియు కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమానికి సిఐటియు నగర కార్యదర్శి ముత్యాల అధ్యక్షత వహించగా లైన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ గోపీచంద్‌, బ్లడ్‌ బ్యాంక్‌ ఇన్చార్జ్‌ రాజా తదితరులు మాట్లాడారు. శిబిరంలో 30 మంది రక్తదానం చేశారు.