ప్రజాశక్తి-పాడేరు: జిల్లా ఆస్పత్రిలోని పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని సూపరింటెండెంట్ కె.కృష్ణారావు, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు, నారాయణలకు శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. కనీస వేతనాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసులో వేతన సమస్యలను వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో పాడేరు జిల్లా ఆసుపత్రి, అరకు వేలి, చింతపల్లి, ముంచంగి పుట్టు,ప్రైమరీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా ఆసుపత్రిలో సానిటేషన్ (పారిశుధ్య), సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనాలు 16,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల జీతాల నుండి ప్రావిడెంట్ ఫండ్ కోత విధించి మిగిలిన జీతం ఇవ్వవలసి ఉండగా, సదరు కాంట్రాక్టర్ కేవలం శానిటేషన్ కార్మికులకు రూ.9000 నుండి 10,700లు మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. సెక్యూరిటీ కార్మికులకు రూ.8,366, చింతపల్లి, ముంచంగిపుట్టు కార్మికులకు కేవలం రూ.9000 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన జీతం ప్రకారం పీఎఫ్. ఈఎస్‌ఐ జమ పోను ప్రతీ కార్మికునకు కనీస వేతనం రూ.13,900 జీతం ఇవ్వాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్ తక్కువ వేతనం ఇస్తున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మిక యూనియన్ కార్యదర్శి ఆర్ ముత్యాలమ్మ, కార్యవర్గ సభ్యులు గాటి, పుణ్యవతి, కొండమ్మ, నాగమణి, సింహాచలం, లక్ష్మణ్ ,శ్రీధర్ పాల్గొన్నారు.










