Jan 01,2023 22:41

భీమవరంలో నేడు భారీ ప్రదర్శన, బహిరంగ సభ
హాజరు కానున్న కేరళ పరిశ్రమల శాఖా మంత్రి రాజీవ్‌, జాతీయ నేతలు
2, 3, 4 తేదీల్లో కార్మిక, ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చలు
ప్రజాశక్తి - భీమవరం

                 సిఐటియు 16వ రాష్ట్ర మహాసభకు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం, రెండో బార్డోలిగా పేరొందిన భీమవరం పట్టణం ముస్తాబైంది. తోరణాలు, జెండాలు, అమరవీరుల ఫ్ల కార్డులు, స్వాగత ద్వారాలతో పట్టణం నలుమూలల కార్మిక సభల వాతావరణం నెలకొంది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభ సందర్భంగా తొలిరోజు పది గంటలకు పతాకావిష్కరణతో ప్రారంభ సభ జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పాత బస్టాండ్‌ నుంచి కొత్త బస్టాండ్‌ ఎదురుగా ఉన్న కేశవరావు హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ గ్రౌండ్‌ వరకూ పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం రెండు గంటలకు బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో కేరళ పరిశ్రమల శాఖా మంత్రి పి.రాజీవ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే సిఐటియు జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ కె.హేమలత, తపన్‌సేన్‌, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.నర్సింగరావు, ఎంఎ.గఫూర్‌, రాష్ట్ర నేతలు జి.బేబిరాణి, వి.ఉమామహేశ్వరరావు, పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జీ తదితరులు ప్రసంగించనున్నారు. ప్రతినిధుల సభా ప్రాంగణానికి టి.షడ్రక్‌, సావిత్రమ్మ నగర్‌గా నామకరణం చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వెయ్యి మంది కార్మిక నాయకులు ప్రతినిధులుగా హాజరుకానున్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను కలుపుతూ మూడు అమరవీరుల జాతాలు ఆదివారం రాత్రికి తాడేపల్లిగూడెం చేరుకున్నాయి. ఇవి సోమవారం ఉదయం బయల్దేరి మధ్యాహ్ననికి భీమవరం చేరుకుంటాయి. మహాసభ ఏర్పాట్లను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు, కార్యనిర్వాహక కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌ తదితరులు పర్యవేక్షించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యాలు, గేయాలు
సిఐటియు రాష్ట్ర మహాసభ సందర్భంగా ప్రజా నాట్యమండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ఆట, పాట, మాట కార్యక్రమంలో భాగంగా చేసిన సాంస్కృతిక నృత్యాలు, అభ్యుదయ గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గురజాడ మా అడుగుజాడ, దేశం అంటే మట్టి కాదని, మాకొద్దు నల్ల దొర తనం, కార్మిక కదంబం, చమట చుక్కా వంటి సాంస్కృతిక నృత్యాలు, ఆజాది డాన్స్‌, ఆవాజ్‌ దో హమ్‌ ఏక్‌ హై డాన్స్‌లు ఆకట్టుకుని ఆలోచింపజేశాయి. ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి.మంగరాజు, ఎస్‌.అనిల్‌కుమార్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ వలీ, చైతన్య ప్రసాద్‌, నాయకులు ఈశ్వర్‌రావు, ఇ.రాజు, సుంకన్న పాల్గొన్నారు.
కార్మిక, ప్రజలు సమస్యలపైనే ఎజెండాగా చర్చిస్తాం
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు
సిఐటియు రాష్ట్ర మహాసభకు భీమవరం పట్టణం తోరణాలు, జెండాలు, అమరవీరుల ప్లకార్డులతో, స్వాగత ద్వారాలతో పండుగ వాతావరణం నెలకొనేలా ముస్తాబైందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం పట్టణంలోని అల్లూరి శ్రీరామరాజు విజ్ఞాన కేంద్రం వద్ద మహాసభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టి.షడ్రక్‌, సావిత్రమ్మనగర్‌లో మహాసభ జరుగుతుం దన్నారు. ఈ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి వెయ్యి మంది కార్మిక నాయకులు ప్రతినిధులుగా హాజరవు తున్నారని తెలిపారు. మూడు సంవత్సరాల కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, కార్మికులకు విశేష సేవలందించిన కార్మిక నాయకులు ఈ మహాసభలకు ప్రతినిధులుగా హాజరవుతున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో కార్మికులను ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోలేకపోయాయన్నారు. కరోనా సమయంలో ఆదుకోకపోగా సమస్యలు సృష్టించిన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారన్నారు. రాష్ట్రంలో అనేక పోరాటాలు నిర్వహించిన పోరాటయోధులకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సిద్ధంగా ఉందన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభమవుతుందని, మహాసభల ప్రారంభ ఉపన్యాసం సిఐటియు అఖిల భారత కార్యదర్శి మాజీ ఎంపీ తపన్‌ సేన్‌ ప్రారంభిస్తారని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పాత బస్టాండ్‌ సెంటర్‌ నుండి కార్మిక కర్షక ప్రదర్శన ర్యాలీ జరుగుతుందని, అనంతరం బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కేరళ న్యాయ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డిఎన్‌విడి ప్రసాద్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జెఎన్‌వి గోపాలన్‌, కె.రాజారామ్మోహన్‌రారు పాల్గొన్నారు.