ప్రజాశక్తి-గుంటూరు : రైతులను వడ్డీ వ్యాపారుల నుండి రక్షించి, వారికి రుణసదుపాయం కల్పించటానికి ఏర్పాటైన సహకార రంగం ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో క్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంది. ఈ వ్యవస్థను రైతులకు ఉపయోగపడకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి. రైతులే కాకుండా సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకూ చట్టపరమైన హక్కులు అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నారు. సహకార వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి గతనెల 17 నుండి దశల వారీగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఆందోళనల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. తక్షణమే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి, ప్రైవేటీకరణ విధానాలు అపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
గుంటూరు జిల్లాలో 167 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రైవేటీకరణ విధానాలతోపాటు, ఉద్యోగులు వారి వేతన సమస్యలు, ఇతర సర్వీసు సమస్యలపైనా ఆందోళనలు చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పిఎస్‌సిఎస్) 50 శాతం వాటాలను ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1964 చట్టానికి ఇటీవల సవరణ చేశారు. దీంతో సహకార సంఘాల మనుగడపై అటు ఉద్యోగులు, రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. షేర్ క్యాపిటల్ రూపంలో ప్రైవేటు వ్యక్తులకు అధిక లాభాలు వెళ్లిపోతాయి. ఇదే గనుక అమలైతే గ్రామాల్లో రైతులకు కాస్తోకూస్తో ఆధారంగా ఉన్న పిఎస్‌సిఎస్‌లపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం పెరుగుతుంది. అంతిమంగా వాటి లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉంది. కొన ఊపిరితో ఉన్న సహకార సంఘాలు పూర్తిగా నిర్వీర్యం అవుతాయి. ఈ నేపథ్యంలో చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని మొదటి డిమాండ్‌తో ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి.
గత రెండేళ్లుగా సంఘలు రైతులకు ఇచ్చే దీర్ఘకాలిక రుణాలపై రైతులు చెల్లించాల్సిన షేర్ ధనం విలువను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. దీంతో ఇప్పటి దాకా రూ.10 వేలకు రూ.500లు షేర్ ధనం చెల్లిస్తున్న రైతులు ఇప్పుడు రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. రైతులకు రూ.10 వేలు రుణంలో రూ.9 వేలే చేతికిస్తున్నారు. రూ.వెయ్యిని షేర్‌ధనం కింద మినహాయిస్తున్నారు. అయితే వడ్డీ మాత్రం రూ.10 వేలకు రైతులు చెల్లిస్తున్నారు.
ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలి
ఎం.వెంకటేశ్వరరావు, జెఎసి నాయకులు
ప్రభుత్వం సహకార సంఘాలను నిర్వీర్యం చేయటానికి చేపడుతున్న సంస్కరణలు విడనాడాలి. ఉద్యోగులు ఒక సంఘం నుండి మరొక సంఘానికి బదిలీ అయినప్పుడు బదిలీ అయిన సంఘంలో లాభనష్టంతో సంబంధం లేకుండా ఉద్యోగులకు వేతనం ఇచ్చే విధంగా భద్రత కల్పించాలి. ఈనెల 17న చలో విజయవాడ నిర్వహించనున్నాం. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
జెఎసి నాయకులు జి.శ్రీనివాసరావు
2009లో జూన్ 22న 151న జిఒలో ప్రతి ఐదేళ్లకూ వేతన సవరణ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 2016 వరకూ అమలు చేయనేలేదు. అనేక వినతులు ఇచ్చాం.ఆందోళనలు చేశాము. దీంతో ప్రభుత్వం హెచ్‌ఆర్ పాలసీ కమిటీ వేశారు. కమిటీ నివేదిక ప్రకారం 2019లో జిఒ 36 ఇచ్చారు. జిఒ అమలు కోసం ప్రభుత్వానికి ఎన్ని వినతులు ఇచ్చినా అమలు చేయకుండా, మళ్లీ జిఒ 90 విడుదల చేశారు. ఈజిఒను కూడా అన్ని పిఎసిఎస్‌లలో అమలు చేయట్లేదు. ఈ నేపథ్యంలో జెఎసిగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నాము. ప్రభుత్వం స్పందించే వరకూ ఆందోళన కొనసాగిస్తాము. 1964న సహాకార చట్టం సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలి.










