ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: సహకార సంఘాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నవీకరణ ప్రక్రియను అధికారులు చేపట్టాలని జిల్లా కలెక్టరు పి రంజిత్ బాషా ఆదేశించారు. జిల్లాలోని సహకార సంఘాల నమోదు, అభివృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో సోమవారం జరిగింది. ప్రాథమిక సహకార సంఘాలు, మహిళ డెయిరీ సంఘాలు, మత్స్యకార సంఘాలు, మహిళా సమాఖ్యలు, బాపట్ల జిల్లాలో 662 సహకార సంఘాలు ఉన్నాయని కలెక్టరు తెలిపారు. సహకార సంఘాలన్నింటినీ నేషనల్ కో-ఆపరేటివ్ డేటాబేస్‌లోకి తీసుకురావాలన్నారు. జిల్లాలో 11 మహిళ డెయిరీ సహకార సంఘాలు నడుస్తున్నాయని, వాటిని తక్షణమే నవీకరించాలని అన్నారు. పంచాయతీల పరిధి లో బహుళ ప్రయోజన ప్రాథమిక సహకార సంఘాలు 112 ఉన్నాయని, మరో 97 డెయిరీ సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావాలన్నారు. వ్యవసాయ శాఖ పరిధిలో 47 సంఘాల ద్వారా 54 మల్టీపర్పస్ గోదాములను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే 96 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సేవలను విస్తృతం చేయాలన్నారు. సహకార సంఘాల ఆధీనంలో జన ఔషధి కేంద్రాలను నడపడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో 7 పెట్రోల్ బంకులు నడపడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వ్యవసాయ సీజన్లో 49 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను ప్రాథమిక సహకార సంఘాల ద్వారా విక్రయించాలని కలెక్టరు రంజిత్ బాషా చెప్పారు. మార్కెటింగ్ సొసైటీల సహకారంతో విక్రయాలకు సంసిద్ధం కావాలన్నారు. ధాన్యం, కంది, శనగలు, మొక్కజొన్న, పసుపు పంటలను రైతుల నుంచి ప్రాథమిక సహకార సంఘాలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తుగా సంఘాల పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వ సర్వర్‌లో నిక్షిప్తం చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి రామారావు, మత్స్యశాఖ అధికారి సురేష్, పశుసంవర్థక శాఖ అధికారి హనుమంతరావు, పిడిసిసి బ్యాంక్ సిఇఓ వై ప్రకాష్, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










