Sep 12,2023 23:19

ప్రజాశక్తి - భట్టిప్రోలు
చేనేత సహకార సంఘాలకు పాలకవర్గం గానీ, ప్రత్యేక అధికారి గాని లేకపోవడంతో లావాదేవీలు లేక కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, తక్షణం బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహశీల్దారు డి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. 2018లో పూర్తయిన పాలకవర్గం గత ప్రభుత్వ పాలనలో ఏడాది పాటు నామినేషన్ బోర్డుతో కొనసాగగా ప్రస్తుత వైసిపి ప్రభుత్వం కూడా నామినేషన్ బోర్డులతోనే కాలయాపన చేసిందని ఆరోపించారు. ఆ బోర్డు కూడా ఏడాది జులై 6తో ముగిసిందని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి బోర్డు, ప్రత్యేక అధికారి లేకపోవడంతో నేత పని చేసిన కార్మికులకు సంఘాలలో సొమ్ము ఉన్నా డ్రా చేసి కార్మికులకు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. దీని వలన  కార్మికులు ఉపాధికి దూరమయ్యారన్నారు. తక్షణమే బోర్డు ఏర్పాటు చేయకపోయినా కనీసం ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను తీర్చాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు మురుగుడు సత్యనారాయణ, గొట్టుముక్కల బాలాజీ, దీపాల సత్యనారాయణ, దొంతు కోటేశ్వరరావు, బట్టు నాగమల్లేశ్వరరావు, రామారావు, శంకర్రావు ఉన్నారు.